
యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
పాలకొండ: యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఎస్పీ ఎస్.వి.మాధవరెడ్డి సూచించారు. పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన సంకల్పం కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ నివారణ, మహిళల భద్రతపై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ప్రతిఒక్కరూ మంచి నడవడికను అలవాటు చేసుకోవాలన్నారు. సైబర్ నేరాలు, ఫోక్సో యాక్ట్‌పై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.రాంబాబు, సీఐ ఎం.చంద్రమౌళి, ఎస్‌ఐ ప్రయోగమూర్తి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ జయమణి, తదితరులు పాల్గొన్నారు.
ఏసీబీవలలో నెల్లిమర్ల కమిషనర్
● ఇంటిప్లాన్ అప్రూవల్‌కు రూ.15వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన అధికారి
నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ కమిషనర్ ఎ.తారక్‌నాథ్ రూ.15వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమ్య అందించిన వివరాల ప్రకారం.. నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని పద్మశాలి వీధిలో నివసిస్తున్న బురిడి మహేష్ అదే వీధిలో ఇంటి నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ కోసం ఇటీవల దరఖాస్తు చేశారు. దీనికోసం కమిషనర్ రూ.20 వేలు డిమాండ్ చేశారు. రూ.15వేలు నగదు రూపంలో, మిగిలిన రూ.5వేలు దివాన్‌కాట్ బెడ్ ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్లాన్ అప్రూవల్ కోసం అవసరమైన ఫీజు చెల్లించానని, లంచం ఇవ్వలేనని ప్రాథేయపడినా కమిషనర్ చలించలేదు. లంచం ఇచ్చుకోలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నగర పంచాయతీ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్‌కు మహేష్ వెళ్లి రూ.15వేలు అందజేశారు. అప్పటికే కాపుకాసి ఉన్న ఏసీబీ డీఎస్పీ రమ్య ఆధ్వర్యంలో సిబ్బంది రెడ్ హ్యాండెడ్‌గా కమిషనర్‌ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసి బుధవారం కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు.
రిమాండ్ ఖైదీల వివరాల సేకరణ
విజయనగరం లీగల్: జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో త్రైమాసిక అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మీటింగ్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్ జిల్లా కోర్టులో మంగళవారం నిర్వహించారు. బెయిల్ లభించినా పూచీకత్తుదారులు లేని కారణంగా జైల్లోనే ఉంటున్న 27 మంది రిమాండ్ ఖైదీల వివరాలు సేకరించారు. సమావేశంలో పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.శోభిక, ఏఎస్పీ అంకిత సురానా, విజయనగరం జిల్లా సబ్ జైల్ అధికారి, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శైలజ పాల్గొన్నారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి