
అంబులెన్స్, ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు నిధులు కేటాయిస్తా
సీతంపేట: గిరిజనులకు సత్వర వైద్యసేవలకోసం అవసరమైన అంబులెన్స్, కిడ్నీ వ్యాధి ప్రభావిత గ్రామాలైన సీతంపేట మండలం జగ్గడగూడ, పాలకొండ మండలం చిలకలవలసకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు వీలుగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు ఎంపీ ల్యాడ్ నిధులు కేటాయిస్తానని అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి తెలిపారు. సీతంపేట ఏరియా ఆస్పత్రిని ఆమె మంగళవారం సందర్శించారు. వార్డులను సందర్శించారు. ఎన్‌ఆర్‌సీ కేంద్రం, బాలింతల వార్డులో వైద్యసేవలు పొందుతున్నవారితో మాట్లాడారు. వైద్యసేవల తీరును అడిగి తెలుసుకున్నారు. రోగులకు రొట్టెలు పంపిణీ చేశారు. ఆపరేషన్ థియేటర్, ఓపీ విభాగాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీతంపేట ఏరియా ఆస్పత్రిలో అదనపు భవన నిర్మాణానికి రూ.22 కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిర్మాణాలు త్వరితగతిన పూర్తయితే రోగులకు మరిన్ని వైద్యసేవలు అందుతాయన్నారు. రోజుకు 400లకు పైగా ఓపీ నమోదవుతోందని, వైద్యులు మెరుగైన వైద్య సేవలందిస్తున్నట్టు రోగులు చెబుతున్నారన్నారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగంగా పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓకు సూచించినట్టు తెలిపారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ, సిటీస్కాన్ వంటి సదుపాయాల కల్పనకు కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓ డి.వి.శ్రీనివాస్, పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎంపీపీ బి.ఆదినారాయణ, వైస్ ఎంపీపీ కుండంగి సరస్వతి, సర్పంచ్‌లు ఆరిక కళావతి, ఎం.తిరుపతిరావు, విజయకుమారి, బి.తిరుపతిరావు, ఎంపీటీసీ చంద్రశేఖర్, ఎస్టీసెల్ జిల్లా కన్వినర్ హెచ్.మోహనరావు, నియోజకవర్గ ఎస్టీసెల్ కన్వీనర్ నిమ్మక కాంతారావు, పార్టీ నాయకులు ఎస్.రాము, వెంకి, ఎన్.కృష్ణ, ప్రకాశరావు, తదితరులు పాల్గొన్నారు.
అరకు ఎంపీ తనూజారాణి
ఏరియా ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్లను
పరామర్శించి రొట్టెల పంపిణీ
సూపర్ స్పెషాలిటీ, ఏరియా ఆస్పత్రి పనుల పరిశీలన