
మంత్రి ఇలాకాలో ఆగని డోలీమోతలు
సాలూరు:
రాష్ట్ర గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖమంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రాతినిథ్యం వహిస్తున్న సాలూరు నియోజకవర్గంలో డోలీమోతలు నిత్యకృత్యంగా మారాయి. గిరిజనులకు నరకయాతన తప్పడంలేదు. సాలూరు మండలం కొదమ పంచాయతీ కంజుపాకకు చెందిన కొండతామర సుందరి నిండు గర్భిణి. రెండవ కాన్పులో మంగళవారం పురిటినొప్పులు రావడంతో రాళ్లదారిలో డోలీలో కుటుంబీకులు, బంధువులు ఆలుగురు ప్రాంతానికి తీసుకువచ్చారు. అక్కడ నుంచి ఆటోలో శంబర పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ప్రాథమిక వైద్యసేవల అనంతరం 108లో సాలూరు ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఏరియా ఆస్పత్రిలో ఆమెకు చికిత్స అందించగా, పుట్టిన బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం విజయనగరం ఘోష ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కురుకుట్టి పంచాయతీ ఎగువకాశాయవలసకు చెందిన ఆశ కార్యకర్త కూనేటి శ్యామల అనారోగ్యానికి గురికావడంతో డోలీలో ఆస్పత్రికి చేర్చిన విషయం తెలిసిందే. తరచూ గిరిజనులను డోలీ కష్టాలు వెంటాడుతున్నా మంత్రి స్పందించడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
పురిటినొప్పులతో డోలీలో గిరిజన గర్భిణి నరకయాతన
మార్గంమధ్యలో 108లో ప్రసవం
బిడ్డ పరిస్థితి విషమంగా ఉండడంతో విజయనగరం ఘోషా ఆస్పత్రికి తరలింపు