
నేటి నుంచి పారిశుద్ధ్య పక్షోత్సవాలు
పార్వతీపురంటౌన్: జిల్లాలో బుధవారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు పారిశుద్ధ్య పక్షోత్సవాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని, అలక్ష్యంచేసే సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ హెచ్చరించారు. పారిశుద్ధ్య పక్షోత్సవాలు, వెక్టర్ హైజీన్ యాప్, పీ–4 సర్వేపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మంగళవారం సమీక్షించారు. మలేరియా, ఇతర జ్వరాలు వ్యాప్తి చెందే ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులకు అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. ప్రజా ప్రతినిధులతో కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేయించాలని, వీలైతే వారిని భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. ప్రతీ మండలంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమమైన మూడు పంచాయతీలను ఎంపిక చేసి ఆగస్టు 15న అవార్డులను ప్రకటిస్తామని తెలిపారు. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలన్నింటిని వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించారు. వర్మీకంపోస్ట్ తయారీకి ప్రాధాన్యమివ్వాలన్నారు. జిల్లాలో పీఎం జన్‌మాన్ కింద చేపడుతున్న గృహాలు మరింత త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు, డీఎంహెచ్‌ఓ ఎస్.భాస్కరరావు, ప్రోగ్రాం అధికారి టి.జగన్మోహనరావు, డ్వామా పథక సంచాలకులు కె.రామచంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ పంచాయతీలకు అవార్డుల ప్రధానం
పారిశుద్ధ్యం నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్