
రూ.1.60 లక్షల కోట్లు ఏమయ్యాయి?
● ఏడాది కాలంగా తెచ్చిన అప్పులు ఎటు మళ్లుతున్నాయి? ● భావితరాల భవిష్యత్‌ను తాకట్టు పెట్టే హక్కు ఎవరిచ్చారు? ● దానికోసం మాట్లాడితే రాజద్రోహం కేసులా.. ● నేను మాట్లాడుతున్నా నాపైనా పెట్టండి ● శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ
చీపురుపల్లి: అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే తెచ్చిన రూ.1.60 లక్షల కోట్ల అప్పు డబ్బులు ఎక్కడకి వెళ్లాయి? సంక్షేమం, అభివృద్ధి పేరుతో తీసుకొస్తున్న వేలకోట్ల రూపాయలు ఎవరి జేబుల్లో కి వెళ్తున్నాయి?.. ఏడాదిలోనే లక్షా అరవై వేల కో ట్లు అప్పులు చేసి భావితరాల భవిష్యత్‌ను తాకట్టు పెట్టే హక్కు చంద్రబాబుకు ఎవరు ఇచ్చారు?.. ఆ డబ్బుతో ఏ సంక్షేమ, అభివృద్ధి పనులు చేపట్టారో చెప్పండి?.. దీనిపై ప్రశ్నించినా, మాట్లాడినా రాజ ద్రోహం కింద కేసులు పెడతారంట.. నేను మాట్లాడుతున్నాను.. నాపై కూడా కేసులు పెట్టండి అంటూ శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారా యణ కూటమి ప్రభుత్వం, నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. గరివిడిలోని ఓ కన్వెన్షన్ ఆవరణలో సోమవారం జరిగిన చీపురుపల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు సంపద సృష్టించడం తనకు తెలుసని చెప్పిన చంద్రబాబు ఏడాదిలోనే రూ.1.60 లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తెచ్చిన అప్పుల కోసం మాట్లాడితే రాజద్రోహం కేసులు పెడతారని చెబుతున్న ప్రభుత్వం, భావితరాల భవిష్యత్‌ను తాకట్టుపెట్టడం దేశ ద్రోహంకాదా అని ప్రశ్నించారు. ఇటీవల జరిగిన క్యాబినేట్ సమావేశంలో మంత్రులు అవినీతిపై చంద్రబాబు ఫైర్ అయినట్లు కొన్ని పత్రికల్లో చూశానని, ‘యథా రాజా తథా ప్రజా’ అనే సామెత గుర్తుకొచ్చిందన్నారు. దోపిడీలో సాక్షాత్తూ చంద్రబాబే నంబర్‌వన్‌గా ఉన్నప్పుడు మంత్రులు మాత్రం ఏం చేస్తారని ఎద్దేవాచేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు చెప్పిన మాటలు, అధికారంలోకి వచ్చాక చేస్తున్న పరిపాలన చూస్తుంటే చంద్రబాబు అంత అబద్ధాలకోరు రాజకీయ నాయకుడిని దేశంలోనే చూడలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్, విజయనగరం పార్లమెంట్ పరిశీలకుడు కిల్లి వెంకటసత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.