
రెన్యువల్ లేదు!
రెగ్యులర్ కాదు..
● సీఆర్‌టీల ఎదురుచూపు
సాక్షి, పార్వతీపురం మన్యం: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్‌టీలను ప్రభుత్వం నేటికీ రెగ్యులర్ చేయలేదు. మరోవైపు వారికి ఇంకా రెన్యువల్ ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. తమను రెగ్యులర్ చేయాలని ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాలవీరాంజనేయస్వామికి సీఆర్‌టీలు వినతిపత్రం కూడా అందజేశారు. 2007లో ఉమ్మడి ఏపీలో 1,243 మంది సీఆర్‌టీలను జీఓ నంబర్ 59 ప్రకారం రెగ్యులర్ చేశారు. 18 ఏళ్లుగా సుమారు 729 మంది పని చేస్తున్నారు. మినిమం టైం స్కేల్ నిబంధనలు కూడా గురుకుల సొసైటీ అమలు చేయడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెన్యువల్ చేయడంలో తాత్సారం
మరోవైపు గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్‌టీలకు రెన్యువల్ ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. రాష్ట్ర అధికారుల నుంచి 20 రోజుల కిందటే ఉత్తర్వులు వచ్చినప్పటికీ.. జిల్లా అధికారులు తాత్సారం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐటీడీఏల పరిధిలో వీరంతా పని చేస్తున్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 55, సీతంపేట పరిధిలో 40 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటి పరిధిలో 330 మందికిపైగా పని చేస్తున్నారు. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే వీరికి రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంది. విద్యాసంవత్సరం ప్రారంభమైనా నేటికీ ఇవ్వకపోవడంతో వారంతా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెందుతున్నారు.
● వెంటనే రెన్యువల్
ఉత్తర్వులు ఇవ్వాలి
గిరిజన సంక్షేమ పాఠశాలల్లో పని చేస్తున్న సీఆర్ టీలకు రెన్యువల్ ఉత్తర్వులు ఇవ్వడంలో తాత్సా రం తగదు. రెండు నెలల నుంచి జీతాలూ లేక, వారంతా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే కౌన్సెలింగ్ తేదీని ప్రకటించి, న్యాయం చేయాలి. లేకుంటే ఆందోళన చేపడతాం.
– మురళీమోహన్, యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు