
ఊరిస్తోంది ఇంకా!
అదిగో చినుకు..
సాక్షి, పార్వతీపురం మన్యం:
ఖరీఫ్ పనులకు కొద్దిరోజుల ముందు వర్షాలు వారం రోజులపాటు కురిస్తే రైతులు మురిసిపోయారు. వ్యవసాయ పనులు మొదలు పెట్టేశారు. తీరా.. ఇప్పుడు వానలు ముఖం చాటేశాయి. వేసవిని తలపిస్తూ ఎండలు మండుతున్నాయి. ఉదయం ఎండ వేడిమి.. సాయంత్రం నాలుగు చినుకులు.. రాత్రయితే ఉక్కపోత.. ఇదీ జిల్లాలో పరిస్థితి. కొద్దిరోజులుగా వేసవిని తలపిస్తున్న ఎండలతో నారుమడులు ఎండుతున్నాయి. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చి రైతులు వరి నారుమడులు తడుపుతున్నారు. జిల్లాలో ఈ నెల 16న 19.1 మి.మీ. సగటు వర్షం కురిసింది. ఇందులో మక్కువ, సీతానగరం, పాలకొండ, కొమరాడ, బలిజిపేట ప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదు కాగా.. కురుపాం, జియ్యమ్మవలస, పార్వతీపురం, పాచిపెంట తదితర మండలాల్లో చినుకు జాడలేదు. జిల్లాలో ఈ ఏడాది జూన్ నుంచి జులై 16వ తేదీ వరకు 247.6 మి.మీ. సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. కేవలం 201 మి.మీ. కురిసింది. గతేడాది ఇదే సమయంలో 264 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. రుతు పవనాలు తొందరగానే ప్రవేశించాయని.. ఇంక వానలే వానలని అనుకున్న రైతులకు నిరాశే మిగిలింది.
ఖరీఫ్‌పై ప్రభావం
జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఖరీఫ్ సీజన్‌లో 2.20 లక్షల ఎకరాల్లో వరితోపాటు, ఇతర ప్రధాన పంటలు సాగవుతాయి. ప్రస్తుతం పంటలకు నీరు అవసరం. కొన్ని మండలాల్లో అడపాదడపా వర్షం కురుస్తున్నా.. మరికొన్ని మండలాల్లో పూర్తిగా ఎండకాస్తోంది. నీటి వనరులున్నా.. ప్రభుత్వ వైఫల్యం కారణంగా సాగుకు ఇవ్వలేని పరిస్థితి. ప్రస్తుతం ఖరీఫ్‌కు సంబంధించి నీరు రాకపోతే నారుమడులు వేసిన రైతులు నష్టపోతారు. నీటి వనరులున్న చోటు ఉడుపులు అవుతున్నాయి. వర్షాలు ఆలస్యమై పైరు దెబ్బతింటుంది. దీనివల్ల వెదలు జల్లడం లేదు. సాధారణంగా ఈ సమయంలో ఉభాలకు పూర్తిస్థాయిలో సిద్ధమవ్వాలి. దమ్ములు కూడా మొదలవ్వాలి. మరోవైపు యూరియా కొరత వేధిస్తోంది. ఈ సమయంలో యూరియా అందకపోతే మొక్క ఎదుగుదల మీద ప్రభావం పడుతుంది. ఓ వైపు వర్ష ప్రభావం, ఇంకోవైపు ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
ఈ ఏడాది జూన్, జులై నెలల్లో
నమోదైన సగటు వర్షపాతం వివరాలు
జూలై సగం గడిచినా ఇంకా లోటు వర్షపాతమే..
ఖరీఫ్ పనులకు వెనకడుగు వేస్తున్న రైతులు
ఎండిపోతున్న ఆశలు
వర్షపాతం ఇలా...
గత ఏడాది జూన్, జూలై నెలల్లో (ఇదే సమయానికి) 247.6 మి.మీ సాధారణ వర్షపాతానికి గాను 264 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అంతకు ముందు 2023లో ఇదే సమయానికి 307.01 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది.
కురిసింది(మి.మీ)