
తెల్ల కాగితం చూపించేసి.. అభిప్రాయాలు చెప్పేయమంటారా?
● జీఓ 3కి ప్రత్యామ్నాయం అంటే ఏమిటి? ● గిరిజనులకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదా? ● మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పీడిక రాజన్నదొర
సాక్షి, పార్వతీపురం మన్యం:
జీవో నంబర్ 3పై స్పష్టత ఇచ్చాకే గిరిజనుల, గిరిజన సంఘాల అభిప్రాయాలను తీసుకోవాలని మాజీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర తెలిపారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు ఎస్.భార్గవి జీవో నంబరు 3, గిరిజన చట్టాలపై గురువారం పార్వతీపురం ఐటీడీఏ వద్ద వివిధ సంఘాలతో సమావేశం కానున్నారని.. ఇక్కడైనా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. గత ఎన్నికలకు ముందు, తర్వాత జీవో నంబరు 3ను పునరుద్ధరిస్తామని చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్, మంత్రి సంధ్యారాణి పదేపదే చెప్పడం నిజం కాదా? అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఈ విషయాన్ని పొందరుపరిచారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యామ్నాయ జీవో అని చెబుతూ.. దానికి సలహాలు, సూచనలు, అభిప్రాయాలు ఇవ్వాలంటున్నారని తెలిపారు. అసలు ప్రత్యామ్నాయ జీవోలో ఏముందో, ఎలా ఉంటుందో చెప్పకుండానే గిరిజనులు, గిరిజన సంఘాలు ఏం అభిప్రాయం చెబుతారని ప్రశ్నించారు. ‘గిరిజనులంతా అమాయకులు కదా.. అందుకే మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు. వారికి ఏం చెప్పినా చెల్లిపోతుంద’న్న ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నట్లు ఉన్నారని ఆరోపించారు.
న్యాయస్థానంలో డిస్మిస్
అయిందని తెలిసి హామీ ఇవ్వలేదా?
గిరిజనులకు రిజర్వేషన్లలో న్యాయం చేద్దామనే మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భావించారని రాజన్నదొర తెలిపారు. జీవో 3కి వ్యతిరేకంగా న్యాయస్థానంలో తీర్పు వస్తే రివ్యూ పిటిషన్ వేశామని గుర్తు చేశారు. ఏప్రిల్, 2022లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా తయారు చేశామని.. నాటి అడ్వకేట్ జనరల్ సలహాలు కూడా తీసుకున్నామని చెప్పారు. రివ్యూ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నప్పుడు వేస్తే కోర్టు ధిక్కారం అవుతుందని ఏజీ సలహా ఇవ్వడంతో ఆ ప్రక్రియ అక్కడ ఆగిందని గుర్తు చేశారు. గత ఎన్నికలకు ముందే 2024 ఏప్రిల్‌లో రివ్యూ పిటిషన్‌పై న్యాయస్థానంలో తీర్పు వ్యతిరేకంగా వచ్చిందన్నారు. డిస్మిస్ అయిందని తెలిసి కూడా జీవో నంబరు 3ను పునరుద్ధరిస్తామని కూటమి నాయకులు ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. నూటికి నూరు శాతం గిరిజనులకు రిజర్వేషన్లు ఇస్తామని ఒప్పుకున్నట్లే కదా? అని అన్నారు. మరి కేంద్రానికి ఎందుకు పంపలేదని, దాగుడు మూతలు ఆడుతున్నారా? అని సందేహం వ్యక్తం చేశారు.
గిరిజనులతో
ఆటలాడుకుంటున్నారా?
ప్రత్యామ్నాయ జీవోలో ఏ విషయమూ స్పష్టంగా చెప్పకుండా సలహాలు అడిగితే ఎలా ఇవ్వగలరని రాజన్నదొర అన్నారు. గిరిజనులతో ఆటలాడుకుంటున్నారా? అని ప్రభుత్వాన్ని, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిని ప్రశ్నించారు. గిరిజన సంఘాల నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలని సూచించారు. ముందుగా స్పష్టత తీసుకున్న తర్వాతే అభిప్రాయాలను వ్యక్తపరచాలని తెలిపారు. తెల్ల కాగితం చూపించి, దాన్ని చూసే అభిప్రాయాలు చెప్పాలన్న తీరులో ప్రభుత్వ వైఖరి ఉందన్నారు. తనను కలిసిన గిరిజన సంఘాలతో ఇదే విషయం స్పష్టం చేశానని రాజన్నదొర అన్నారు.