
పాఠశాల బాగుకు ఒక్కటయ్యారు...
కొమరాడ: తమ గ్రామ పాఠశాల బాగుకు ఆ గ్రామస్తులంతా ఒక్కటిగా ముందుకు కదిలారు. అధికారులు, పాలకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారు. అయినా ఫలితం లేకపోయింది. ఇక మన పాఠశాలను మనమే బాగు చేసుకుందామని అంతా ఒక్కటిగా ముందుకు సాగారు. ఒక్కో కుటుంబం నుంచి రూ.400లు సేకరించారు. ఆ గ్రామస్తులే.. గాజులగూడ గిరిజనులు. వివరాల్లోకి వెళ్తే.. కొమరాడ మండలం కెమిశీల పంచాయతీ గాజులగూడ గ్రామంలో 110 గిరిజన కుటుంబాలు ఉన్నాయి. గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 55 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉపాధ్యాయులు ఐదుగురున్నారు. ఈ ఏడాది ఈ పాఠశాల మోడల్ ప్రైమరీ పాఠశాలగా అప్‌గ్రేడ్ అయింది. ఒకే తరగతి గది ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో తమ పిల్లల భవిష్యత్ కోసం రెండు దశాబ్దాల కిందట మంజూరైన అదనపు గది అసంపూర్ణంగా ఉండడంతో ఆ గదినే రేకుల షెడ్‌తో నిర్మించుకుంటున్నారు. ఇందుకు గ్రామస్తులు పోగు చేసిన రూ.50వేలు ఖర్చు పెడుతున్నారు. అదే సమయంలో ఈ పనుల్లో గ్రామస్తులే కూలీలుగా మారి అధికారులు, పాలకులకు కనువిప్పు కలిగేలా పని చేస్తూ పాఠశాల బాగుకు నడుం బిగించారు.
అధికారుల చుట్టూ తిరిగాం..
మా పాఠశాలలో 55 మంది విద్యార్థులున్నారు. ఐదుగురు ఉపాధ్యాయులు ఉన్నా రు. పాఠశాల గదుల నిర్మాణం కోసం అధికారులు, పాలకుల చుట్టూ తిరిగాం. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తామే ఒక్కటిగా నిలిచి విరాళాలు పోగు చేసి పాఠశాలలో అదనపు తరగతి గదిని నిర్మించుకుంటున్నాం.
– కుడ్రక మల్లేశ్వరరావు,
గాజులగూడ
నిధులు పోగు చేశారు..
తరగతి గదిని నిర్మించుకుంటున్నారు..

పాఠశాల బాగుకు ఒక్కటయ్యారు...

పాఠశాల బాగుకు ఒక్కటయ్యారు...