
పంటల బీమాతో ప్రయోజనం
● జూలై 15లోగా పత్తి, అరటి పంటలకు బీమా ప్రీమియం చెల్లించాలి
● ఈ నెల 31లోగా మొక్కజొన్న ప్రీమియం, ఆగస్టు 15లోగా వరి పంట ప్రీమియం చెల్లించాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్
పార్వతీపురం టౌన్: రైతులు పంటలకు బీమా చేయించుకుంటే ఎంతో ప్రయోజనమని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రైతులకు పంట బీమా పథకాన్ని అమలు చేస్తున్నాయని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. బీమాపై రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆయన ఆదేశించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద రైతులకు తక్కువ ప్రీమియం చెల్లింపుతో బీమా పథకం అమలు జరుగుతుందని ఆయన చెప్పారు. ఫసల్ బీమా యోజనను ఇఫ్కో టోకియో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆధ్వర్యంలో జరుగుతోందన్నారు. ఎంపిక చేసిన పంటలకు బీమా చేసిన మొత్తానికి రెండు శాతం, వాణిజ్య – ఉద్యాన పంటలకు 5 శాతం చెల్లించాలని చెప్పారు. వాస్తవ ప్రీమియంలో రైతు చెల్లించగా మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తాయని ఆయన తెలిపారు. రైతులు వరి పంటకు ఆగస్టు 15వ తేదీ లోగా, మొక్కజొన్న పంటకు జూలై 31వ తేదీలోగా ప్రీమియం చెల్లించాలని చెప్పారు. పత్తి, అరటి పంటల బీమా జూలై 15వ తేదీలోగా చెల్లించాలని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో వరి పంటకు ఎకరాకు రూ.40 వేలు
పార్వతీపురం మన్యం జిల్లాలో వరి పంటకు ఎకరాకు రూ.40 వేలు ప్రీమియం చెల్లించాలని, అయితే రైతులు తమ వాటాగా రూ.8 వందలు చెల్లిస్తే సరిపోతుందని, మిగిలిన మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందని వివరించారు. మొక్కజొ న్న పంటకు ఎకరాకు రైతు వాటా రూ.330 అన్నారు. పత్తి పంటకు ఎకరాకు రూ.1923 ప్రీమియం కాగా రైతు వాటా కింద రూ.98 చెల్లించాలని, అరటి పంటకు రూ.3036 కాగా రైతు వాటా కింద రూ.152 చెల్లించాలని ఆయన చెప్పారు. రైతులు ప్రీమియంను తమ సమీపం లోని కామన్ సర్వీస్ సెంటర్, సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్, పీఏసీఎస్, పోస్టాఫీసుల ద్వారా రైతుల ఆధార్, భూమి, కౌలు కార్డు, పంట వేసిన ధ్రువ పత్రాన్ని, బ్యాంకు వివరాలకు సంబంధించిన పత్రాలను సమర్పించి ఆన్ లైన్ ద్వారా ప్రీమియం చెల్లించి రసీదు పొందవచ్చన్నారు.
రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు
రైతులు ఎటువంటి దళారులని, మధ్యవర్తులని నమ్మి మోసపోవద్దని కలెక్టర్ సూచించారు. పంట వేసిన ధ్రువపత్రం జారీ నిమిత్తం కూడా ఎటువంటి మొత్తాన్ని రైతు సేవ కేంద్రంలోని సిబ్బందికి చెల్లించనవసరం లేదని ఆయన చెప్పారు. గడువు తేదీ ముందుగానే తమ ప్రీమియం చెల్లింపు చేసి తగు రసీదు పొందాలని సూచించారు. బీమా వేసిన పంట వివరాలు ఇ – పంట లో సక్రమంగా నమోదు అయ్యాయో లేదో సరిచూసుకోవాలని ఆయన సూచించారు. తద్వారా దరఖాస్తుల పూర్తి ఆమోదం సులభంగా జరుగుతుందన్నారు.