
టోల్‌గేట్ వేయింగ్ మిషన్ వద్ద అక్రమ వసూళ్లు
● నిర్వాహకులను నిలదీసిన లారీ
యజమానులు, సిబ్బంది
డెంకాడ: మండలంలోని నాతవలస టోల్‌గేట్ వద్ద ఉన్న వేయింగ్ మిషన్ పని చేయకపోయినా ఇష్టం వచ్చినట్లు వాహనాల వద్ద అధిక బరువు పేరుతో డబ్బులు అక్రమంగా వసూలు చేస్తున్నారని లారీ యజమానులు, సిబ్బంది వేయింగ్ మిషన్ నిర్వాహకులను నిలదీశారు. అధిక బరువుతో వెళ్తున్న వాహనాలు ఎంత మేరకు అధిక బరువుతో ఉన్నది వేయింగ్ మిషన్ ద్వారా వాహన యజమానులకు తెలుస్తుంది. అయితే వేయింగ్ మిషన్ పని చేయకపోయినా వారికి నచ్చినంత అధిక బరువు పేరుతో నిర్వాహకులు డబ్బులు తీసుకుంటున్నారని లారీ యజమానులు, సిబ్బంది చెప్పారు. వేయింగ్ మిషన్ పని చేయకపోయినా ఎలా అధిక బరువు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు. కొంతకాలంగా ఇది జరుగుతోందని ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. నిర్వాహకులు, లారీ యజమానుల మధ్య వివాదం చివరకు పోలీసుల వద్దకు చేరింది. ఈ మేరకు భోగాపురం సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో వివాదంపై చర్చలు జరిగాయి. లారీ యజమానుల తరఫున లారీ ఓనర్ల అసోషియేషన్ రాష్ట అధ్యక్షుడు మహారథి,సెక్రటరీ శేషగిరి, ట్రెజరర్ వీవీ రాజు తదితరులు హాజరవగా, నిర్వాహకులు తరఫున కొందరు హాజరయ్యారు. వేయింగ్ మిషన్ బాగు చేసే వరకూ అధిక లోడ్ చార్జీలు వసూలు చేయరాదని నిర్వాహకులను అధికారులు ఆదేశించారు. తూనికలు, కొలతల శాఖ నుంచి అధికారులు పనిచేయని వేయింగ్ మిషన్‌ను పరిశీలించారు.