
పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తేనే పనులు
కూటమి ప్రభుత్వంలో సరిపడా నిధులు వస్తేనే 2026 చివరికై నా తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురాగలం. ఈ ప్రాజెక్టు ద్వారానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నీరందించాల్సి ఉంది. ప్రాజెక్టు వ్యయం రూ.804 కోట్లకు పెరగడంతో ఇప్పుడు ఈ ప్రభుత్వం విడుదల చేసే నిధులు ఏ కోశానా సరిపడవు. పై మొత్తం నిధులు విడుదలైతేనే 2026 డిసెంబర్ నాటికి విజయనగరం పట్టణానికి, భోగాపురం విమానాశ్రయానికే కాకుండా సుమారు 20 వేల ఎకరాలకు కూడా నీరందించగలం. – అప్పలనాయుడు,
తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టు ఈఈ
విజయనగరం గంటస్తంభం: రెండు దశాబ్దాలుగా సాగుతున్న ప్రాజెక్టు తారకరామ తీర్థసాగర్. 2005 ఫిబ్రవరి 19న ప్రారంభించిన ప్రాజెక్టు అంచెలంచెలుగా అంచనా వ్యయం పెరుగుతోందే తప్ప పనులు మాత్రం పూర్తి కావడం లేదు. రాష్ట్రంలో 15 ఏళ్ల పాటు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన చంద్రబాబునాయుడు ఏనాడూ ప్రాజెక్టు పూర్తికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోలేదు. ఉత్తరాంధ్రలో అత్యంత కీలకమైన ప్రాజెక్టును పూర్తి చేయడానికి గత వైఎస్ జగమోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన కుమిలి రిజర్వాయర్‌లో మిగిలిన పనులను రూ.150.24 కోట్లతో పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులకు ఆదేశాలిచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలోని పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లో గల 49 గ్రామాల్లోని 24,710 ఎకరాలకు సాగు నీరందుతుంది.
భూసేకరణే అసలు సమస్య..
తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు అవసరమైన 3497.58 ఎకరాల భూమికిగాను 3278.32 ఎకరాలను సేకరించారు. మిగతా 219.26 ఎకరాల సేకరణపై అధికారులు దృష్టిపెట్టారు. కుమిలి రిజర్వాయర్ ప్రాజెక్టులో కోరాడపేట, ఏటీ అగ్రహారం, పడాలపేట ముంపునకు గురవుతాయి. ఈ గ్రామాల్లోని 2,219 కుటుంబాలకు పునరావాసానికే రూ.209.88 కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం తాజాగా కేవలం రూ.5కోట్లు మాత్రమే కేటాయించింది. తాడిపల్లి, కుదిపి, నీలంరాజు పేట గ్రామాల నిర్వాసితులకు పరిహారానికి రూ.75.69 కోట్లు ఖర్చవుతుంది. ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉంది. నిర్వాసితులకు పునరావాసం కల్పించాక చంపావతి నుంచి నీటిని మళ్లించి, ఆయకట్టుకు నీళ్లందించడంతో పాటు విజయనగరం కార్పొరేషన్‌కు తాగునీరు సరఫరా అవకాశం కుదురుతుంది.
తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు
ప్రాజెక్టు కీలకం
విజయనగరం పట్టణానికి తాగునీరు, భోగాపురం విమానాశ్రయానికి నీటి అవసరాలను తీర్చడమే కాకుండా సుమారు 20వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు నిర్మాణం ఎంతో అవసరం. ప్రాజెక్టుకు అరకొరగా నిధులు కేటాయించడంతో ఈ ఏడాది పనులు పూర్తయ్యే పరిస్థితి లేదు. మరి 2026 నాటికల్లా నీరు రాకుండా ఉంటే తాగునీరు సమస్య, అటు పారిశ్రామిక, విమానాశ్రయానికి నీరు లేక వెలవెలబోతుంది. ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఎయిర్‌పోర్టు అవసరాలకు తాగునీరు, వాడుక నీరు ప్రధానం కావున ఇందుకోసం తారకరామతీర్థ సాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల్సి ఉంది.
ప్రాజెక్టు నిర్మాణం ఇలా..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞంలో భాగంగా తారకరామ తీర్థ సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లా గుర్ల మండలం కోటగండ్రేడు వద్ద చంపావతి నదిపై 184 మీటర్ల పొడవున బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి 13.428 కిలోమీటర్ల కాలువ ద్వారా కుమిలిలో నిర్మించే రిజర్వాయర్‌కు 27 టీఎంసీల నీటిని మళ్లిస్తారు. ఇక్కడి నుంచి కుమిలి చానల్ సిస్టం పరిధిలోని 8,172 ఎకరాలను స్ధిరీకరించడంతో పాటు కొత్తగా 16,538 ఎకరాలకు సాగునీందించాలి. వైఎస్సార్ మరణానంతరం అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రాజెక్టు పనులు పట్టించుకోలేదు. 2014 నుంచి 2019 మధ్య పాలన సాగించిన చంద్రబాబునాయుడు ప్రాజెక్టు పనుల ఊసెత్తలేదు. అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టులో అంతర్భాగమైన బ్యారేజీ నిర్మాణాన్ని దాదాపు పూర్తిచేశారు. మళ్లింపు కాలువ, కుమిలి రిజర్వాయర్ పనులు పెడింగ్‌లో ఉన్నాయి. కుమిలి రిజర్వాయర్ డైక్–2, డైక్–3లలో 2.2 కిలోమీటర్ల మట్టికట్ట పనుల్లో రూ.150.24 కోట్ల పనులు మిగిలాయి. వాటిని చేపట్టిన కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. దీంతో 60–సీ నిబంధన కింద కాంట్రాక్టర్‌ను తొలగించి, పనులను మరో కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఆ మేరకు ప్రతిపాదనలను జ్యూడిషియల్ ప్రివ్యూకు పంపారు.

పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేస్తేనే పనులు