
యుద్ధప్రాతిపదికన సీసీఆర్సీ పంపిణీ జరగాలి
● కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్
పార్వతీపురంటౌన్: జిల్లాలో యుద్ధప్రాతిపదికన సీసీఆర్ కార్డుల పంపిణీ జరగాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. సొంత భూమిలేని కాలు రైతులందరికీ కౌలు గుర్తింపు కార్డులు అందించాలని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వ్యవసాయం, అనుబంధ రంగాల శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కౌలు రైతులకు ప్రభుత్వ పథకాలు అందాలంటే రెవెన్యూ శాఖ జారీచేసే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని, ఈ కార్డులు కలిగిన వారు మాత్రమే పంట నమోదు చేసుకునే అవకాశం ఉందని, పంట నమోదు ఆధారంగా పంటల బీమా, ఇన్‌పుట్ సబ్సిడీ, ఇతర వ్యవసాయ పథకాలు అమలవుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. కావున ఇన్ని ప్రయోజనాలు ఉన్న సీసీఆర్ కార్డుల పంపిణీ త్వరగా పూర్తిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా త్రైమాసికానికి లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు. నిర్దేశించుకున్న లక్ష్యాలు, సాధించిన ప్రగతి వివరాలను ఎప్పటికపుడు తన కు నివేదిక రూపంలో అందించాలని ఆదేశించారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా గ్రామ వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా పశు సంవర్థక శాఖాధికారి డా.ఎస్.మన్మథరావు, జిల్లా పట్టు పరిశ్రమ అధికారి ఏవీ సాల్మన్ రాజు, మత్స్య అభివృద్ధి అధికారి యు.చాందిని, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.