
శతశాతం రాయితీపై బిందు, తుంపర సేద్యం పరికరాలు
పార్వతీపురం టౌన్: ఎస్సీ, ఎస్టీ రైతులు, ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు రూ.2.18 లక్షల విలువైన డ్రిప్ పరికరాలను 100 శాతం రాయితీతో అందిస్తామని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ స్పష్టంచేశారు. 5 నుంచి 10 ఎకరాలు భూమి కలిగిన రైతులకు గరిష్టంగా రూ.3.18లక్షల విలువైన డ్రిప్ పరికరాలను 90 శాతం రాయితీతో అందజేస్తామని చెప్పారు. కలెక్టరేట్‌లో వ్యవసాయాధికారుల సమీక్షలో ఆయన మంగళవారం మాట్లాడారు. జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి 2090 హెక్టర్లలో బిందు, తుంపర సేద్యం లక్ష్యంగా నిర్ణయించామన్నారు.
మిషన్ కల్పవృక్షతో అద్భుత ఫలితాలు
జిల్లాలో తలపెట్టిన మిషన్ కల్పవృక్ష కార్యక్రమంతో అద్భుత ఫలితాలు సాధించవచ్చని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. జిల్లావ్యాప్తంగా 5 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగుచేయాలన్నది లక్ష్యంగా నిర్దేశించామన్నారు. పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పరిధిలో ప్రజల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రాజెక్టు అధికారులను ఆదేశించారు. గొర్రెలు, మేకల పెంపకాన్ని, పశుపోషణను ప్రోత్సహించాలని, వీడీవీకేలను బలోపేతం చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పలువురు పాల్గొన్నారు.