
పట్టాలిచ్చి గిరిజనులపై కేసులు పెడతారా?
పార్వతీపురం రూరల్: గిరిజనుల జీవనోపాధికోసం అప్పటి ప్రభుత్వ అధికారులు గిరిజనులు సాగు చేసిన పోడు భూములకు జీఓ ప్రకారం అటవీశాఖ, రెవెన్యూ అధికారుల సమన్వయంతో సంగంవలస పంచాయతీ సీతంపేట గ్రామంలో నివసిస్తున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ చేశారని సీపీఎం మండల అధ్యక్షుడు పి.రాము అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మండలంలోని సీతంపేటను సందర్శించిన అక్కడి గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అన్నిశాఖల సమన్వయంతో ఇచ్చిన పట్టా భూముల్లో జీవనోపాధి కోసం గిరిజనులు సాగు చేస్తున్న భూముల్లోకి అటవీశాఖాధికారులు వెళ్లి సీతంపేట గిరిజనులను ఇబ్బందులకు గురిచేయడం దారుణమన్నారు. భూములపైకి వెళ్లి వారిపై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ధ్వజమెత్తారు. పట్టాలిచ్చి అమాయకులైన గిరిజనులపై ఏ విధంగా కేసులు పెడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అటవీశాఖ అధికారులు ఎందుకు భూములపైకి గిరిజనులను రానివ్వకుండా నిలువరిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టిసారించి పరిష్కారం చూపాలని కోరారు.
సీపీఎం నాయకుడు పి రాము