
టీచర్లపై బోధనేతర పనుల భారం తగ్గించాలి
విజయనగరం అర్బన్: ఉపాధ్యాయులపై అధికంగా మోపుతున్న బోధనేతర పనుల భారం తగ్గించాలని ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు స్థానిక సంఘం కార్యాలయం ఆవరణలో ఆదివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో పలు డిమాండ్లను సాధించాలని తీర్మానం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బోధనపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలంటే బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని కోరారు. ఈ నెల 10న నిర్వహించనున్న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కోసం లీవ్ యాప్‌లో ‘విట్‌నెస్’ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయాలని అధికారుల ఆదేశాలున్నాయని వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. యూనిఫారాలు, షూస్, బెల్టులు, పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం వంటి అంశాలపై కోడ్ నంబర్లతో అప్‌లోడ్ చేయాలన్న సూచనలు ఉపాధ్యాయులను మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయని వాపోయారు. యాప్‌ల భారాన్ని తగ్గిస్తామని చెబుతూ అన్ని పనులు ఒకే యాప్‌లో పెట్టడం వల్ల ప్రతి క్షణం ఉపాధ్యాయులకు పని భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక భారం లేని అంశాలైన ఆప్షన్ హాలిడేల విషయంలో ఉపాధ్యాయుల అభిప్రాయాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్న విధానం ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతోందన్నారు. సంఘం అధ్యక్షుడు షేక్ బుఖారీ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పాల్తేరు శ్రీనివాస్, శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు మజ్జి మదన్ మోమన్‌రావు, రాష్ట్ర అకడమిక్ సెల్ సభ్యుడు జేసీరాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు బంకురు జోగినాయుడు, జిల్లా సబ్‌కమిటీ సభ్యులు, వివిధ మండలాల బాధ్యులు పాల్గొన్నారు.
ఏపీటీఎఫ్ జిల్లా కమిటీ డిమాండ్