
పీడీఎస్ బియ్యం పట్టివేత
పాలకొండ రూరల్: అక్రమంగా తరలిపోతున్న పీడీఎస్ బియ్యం విజిలెన్స్ అధికారులు మెరుపుదాడితో పట్టుకున్నారు. ఆ శాఖ ఎస్‌ఐ రామారావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. వీరఘట్టం నుంచి ఓ వ్యాన్‌లో ఒడిశాకు ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం అక్రమంగా తరలిపోతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందిందన్నారు. దీంతో అధికారులు ఆ రహదారిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. పాలకొండ కార్గిల్ పాయింట్ వద్ద గల మార్కెట్ కమిటీకి చెందిన చెక్‌పోస్టు వద్ద మాటు వేసిన విజిలెన్స్ అధికారులు వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టుబడ్డాయని తెలిపారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.లక్ష 7వేల వరకూ ఉంటుందని అధికారులు లెక్క కట్టారు. పట్టుబడిన వాహనం సీజ్ చేయటంతో పాటు అందులో తరలించే యత్నం చేసిన బియ్యం బస్తాలను స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పజెప్పామని ఎస్‌ఐ తెలిపారు. ఆ శాఖ సిబ్బంది లక్ష్మీనారాయణ, కన్నబాబు, శ్రీనుబాబు తదితరులున్నారు.
7న గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్
విజయనగరం అర్బన్: ఉమ్మడి విజయనగరం జిల్లాలోని గురుకుల బాలురు, బాలికల పాఠశాలలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల మిగులు సీట్ల భర్తీకి సంబంధించి కౌన్సెలింగ్‌ను ఈ నెల 7వ తేదీన నెల్లిమర్ల గురుకుల పాఠశాలలో చేపట్టనున్నామని ఉమ్మడి జిల్లా సమన్వయకర్త ఎస్.రూపావతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కేవలం ఎస్సీ, ఎస్టీ కేటగిరిలకు చెందిన విద్యార్థులకే ఈ కౌన్సెలింగ్ అవకాశం ఉందని ఆమె స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు బాలికలకు, మధ్యాహ్నం 1 గంటకు బాలురు కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఆధార్‌కార్డు జెరాక్స్ కాపీ, కుల ధ్రువీకరణ పత్రం, పదవ తరగతి విద్యార్థులైతే మార్కుల జాబితా తదితర పత్రాలతో హాజరు కావాలని ఆదేశించారు.
పోలీసులకు చిక్కిన గంజాయి నిందితుడు
విజయనగరం క్రైమ్: నగరంలోని అయ్యన్నపేట వద్ద గల వాకింగ్ ట్రాక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి గంజాయితో వన్‌టౌన్ పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. వాకింగ్ ట్రాక్ వద్ద ఓ వ్యక్తి అనుమానితంగా సంచరిస్తుండడాన్ని ఎస్‌ఐ లక్ష్మీప్రసన్నకుమార్ శనివారం గుర్తించారు. ఆయన వద్ద ఒక కత్తి, తపంచా ఉండడాన్ని చూసి ప్రశ్నించడంతో పారిపోయేందుకు ప్రయత్నించాడు. ఎస్‌ఐ పట్టుకొని సోదా చేయగా మూడు కేజీల గంజాయి ప్యాకెట్లు అతని వద్ద లభ్యమయ్యాయి. ఈ వ్యక్తిని విజయనగరం ఎల్‌బీజీ నగర్‌కు చెందిన మజ్జి కృష్ణవర్దన్‌గా గుర్తించారు. రాయఘడ నుంచి గంజాయి కొనుగోలు చేసి విజయనగరంలో విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. పోలీసులకు పట్టుబడ్డాడు. వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ లక్ష్మీప్రసన్నకుమార్ నిందితుడిని విచారించారు. కత్తి, తపంచా, గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించినట్టు సీఐ తెలిపారు. ఇతనిపై గతంలో రౌడీషీట్ ఉందని సీఐ చెప్పారు.