
లోక్ అదాలత్‌లో 116 కేసుల రాజీ
పార్వతీపురం టౌన్: జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో 116 కేసులను ఇరువురు అంగీకారంతో రాజీ చేసినట్టు రెండవ అదనపు జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు అన్నారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి మార్గదర్శిగా ఉపయోగపడుతుందన్నారు. సివిల్, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, మోటార్ ప్రమాద పరిహార కేసులు, ఇతర వివాదాలను పరిష్కరించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. కక్షిదారులు రాజీ చేసుకోవడం వల్ల ఖర్చులు తగ్గుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. కోర్టుకు ఎటువంటి ఫీజు చెల్లించకుండా కేసులు రాజీ చేసుకోవచ్చని సూచించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమైతే కోర్టుకు మొదట చెల్లించిన రుసుమును కక్షిదారులకు కోర్టు తిరిగి చెల్లిస్తుందన్నారు. లోక్ అదాలత్‌లో బాధితులకు న్యాయం త్వరగా లభించే అవకాశం ఉంటుందన్నారు. లోక్ అదాలత్‌లో సుమారు రూ.18,24,808ల విలువైన కేసులలో రాజీ చేసినట్టు వివరించారు. అడిషనల్ జుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జె.సౌమ్యా జాస్పిన్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె.చంద్రకుమార్, బార్ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు, అధిక సంఖ్యలో కక్షిదారులు పాల్గొన్నారు.