
నిల్వ బియ్యం వల్లే పురుగులు
సాక్షి, పార్వతీపురం మన్యం: పాఠశాలలకు సరఫరా చేసిన బియ్యం ఎక్కువ రోజులు నిల్వ ఉండడం వల్లే పెంకి పురుగులు కనిపించాయని జిల్లా పౌరసరఫరాల సంస్థ ప్రబంధకులు కె.శ్రీనివాసరావు తెలిపారు. ‘మెనూ.. పురుగులతోనే తిను’ శీర్షికన ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. సంస్థ క్వాలిటీ సిబ్బందితో ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేయించారు. జూన్ అలాట్‌మెంట్‌కు సంబంధించి బియ్యం నిల్వలే ఇప్పటి వరకు ఉన్నాయని గుర్తించారు. వాటిలో పెంకి పురుగులు, లార్వాను గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పిల్లలకు బలవర్థకమైన ఆహారాన్ని అందించే ఉద్దేశంతో ఫోర్టిఫైడ్ సన్నబియ్యాన్ని గత జూన్ నెల నుంచి ప్రారంభించామని తెలిపారు. జిల్లాలోని మొత్తం 1,662 పాఠశాలలకు ఎనిమిది ఎంఎల్‌ఎస్ కేంద్రాల నుంచి 11,944 బస్తాల బియ్యాన్ని గత నెల 12వ తేదీలోపే పంపిణీ చేశామని వివరించారు. జిల్లాకు గుంటూరు నుంచి ఈ ఏడాది మే 14న 897.209 టన్నుల బియ్యం వచ్చినట్లు తెలిపారు. వాటిని ఫ్యుమిగేషన్ చేసిన తర్వాత ప్యాకింగ్ చేసి, పాఠశాలలకు తరలించామని పేర్కొన్నారు. 35 రోజుల కాలపరిమితి ముగియడం వల్ల పురుగు పట్టిందని తెలిపారు. వాటి స్థానంలో కొత్తగా బియ్యం బస్తాలు ఆయా పాఠశాలలకు పంపిస్తున్నామని వివరించారు. బియ్యం నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పాఠశాలలకు, వసతిగృహాలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
వాటి స్థానంలో పాఠశాలలకు కొత్త బస్తాల సరఫరా

నిల్వ బియ్యం వల్లే పురుగులు