
మోత తప్పలే!
● డోలీ మోతలకు చెక్ పెట్టినట్లు చెప్పిన మంత్రులు ● కొద్దిరోజులకే సాలూరు నియోజకవర్గంలోనే మరో ఘటన ● ఆర్భాటంగా ప్రారంభించిన కంటైనర్ ఆస్పత్రికి సమీపంలోనే..
అక్కడే కంటైనర్
ఆస్పత్రి ఉన్నా..
సాక్షి, పార్వతీపురం మన్యం:
సుపరిపాలనకు తొలి అడుగు అంటూ.. ఇటీవ ల కలెక్టరేట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ఎమ్మెల్యేలు, అధికారులు సమావేశమయ్యారు. గిరి ప్రాంతాలకు రహదారు లు నిర్మిస్తున్నామని చెబుతూ.. డోలీ మోతలను అరి కట్టామని మంత్రులు చెప్పారు. అలా చెప్పి ఎన్ని రోజులూ కాలేదు. మంత్రి సొంత నియోజకవర్గమైన సాలూరు మండలంలోనే మరో మహిళను డోలీలో ఆసుపత్రికి తరలించడం గమనార్హం.
ఆశ కార్యకర్తకే తప్పలేదు..
రెండు రోజుల కిందట సాలూరు మండలం కరడవలస పంచాయతీ ఎగువ కాషాయవలస గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త కూనేటి శ్యామల వాంతులు, విరేచనాలతో బాధ పడటంతో కుటుంబ సభ్యులు.. డోలీ కట్టి.. కొండలు, గుట్టలు దిగి, సువర్ణముఖి నదిని దాటి సాలూరు ఆస్పత్రికి తరలించారు.
●కొద్దిరోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న సాలూరు మండలం బొడ్డపాడు గిరిశిఖర గ్రామానికి చెందిన సీదరపు నాగేశ్వరరావు అనే గిరిజనుడిని పది కిలోమీటర్లు డోలీలో జిల్లేడు వలస వరకు తీసుకొచ్చి, అక్కడ నుంచి ఆటోలో సాలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
●విజయనగరం జిల్లా ఎస్.కోటలోని రేగపుణ్యగిరి గిరిజన గ్రామం నుంచి అర్జున్ అనే వ్యక్తిని చికిత్స నిమిత్తం సుమారు ఐదు కిలోమీటర్లు డోలీలో తరలించాల్సి వచ్చింది.
●కొన్నాళ్ల కిందట కొమరాడ మండలం చినఖేర్జిల పంచాయతీ సీసాడవలసకు చెందిన గర్భిణిని కుటుంబ సభ్యులు మంచంపై ఉంచి మైదాన ప్రాంతానికి తరలించారు. అక్కడ నుంచి 1089 వాహనంలో పార్వతీపురం ఆస్పత్రికి చేర్చారు.
కంటైనర్ ఆస్పత్రికి కిలోమీటరు
దూరంలో ఉన్నా సరే...
మన్యం ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలకాల ని గిరిశిఖర ప్రాంతాల్లో కంటైనర్ ఆస్పత్రులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే పైలట్ ప్రాజెక్టు కింద పార్వతీపురం మన్యం జిల్లాలో కంటైనర్ ఆస్పత్రిని ఇటీవల ప్రారంభించారు. పది గ్రామాల ప్రజలకు ఈ కంటై నర్ ద్వారా వైద్యసేవలు అందుతాయని ప్రకటించా రు. సాలూరు మండలం తోణాం పంచాయతీ పరి ధి గిరిశిఖర కరడవలసలో దీన్ని నెలకొల్పారు. అక్క డ సేవలు ఏ స్థాయిలో అందుతున్నాయో చెప్పడాని కి బుధవారం జరిగిన డోలీ మోత ఘటనే నిదర్శనం. కరడవలసకు కేవలం కిలోమీటరు దూరంలోపునే బాధిత మహిళ గిరిజన గ్రామం ఉంది. అక్కడ సేవలు అందుబాటులో లేకపోవడంతోనే సుదూర ప్రాంతం తీసుకొచ్చి, సాలూరు ఆసుపత్రి లో చేర్చారు. డోలీల మోతలు లేకుండా చేస్తున్నామని.. గిరి ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పిస్తున్నామని కొద్ది నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జిల్లా పర్యటన సందర్భంగా తెలిపా రు. ఆయన శంకుస్థాపన చేసిన రహదారి నేటికీ ప్రారంభం కాకపోవడం గమనార్హం. కూరుకూటి ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. నేటికీ కార్యరూపం దాల్చలేదు.