
గంగరేగువలసలో బెంగ..!
● గ్రామంలో కేన్సర్ మహమ్మారి అంటూ అలజడి ● ఆందోళనలో గ్రామస్తులు
కొమరాడ:
మండలంలోని గంగరేగువలస పంచాయతీ లోని సోమినాయుడువలస, చినగంగరేగువలస గ్రామాల్లో సుమారు 600 కుటుంబాలు, 2500మంది నివసిస్తున్నారు. గడిచిన మూడేళ్లుగా కేన్సర్ బారిన పడుతూ పలువురు చనిపోతున్నారని పంచాయతీ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే నిత్యం పంటలతో సస్యశ్యామలంగా ఉన్న ఈ గ్రామానికి ఏమైందంటూ ప్రజాసంఘాలు, మేధావులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో ముగ్గురు మాత్రమే కేన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని ప్రభుత్వ వైద్యాధికారుల లెక్కల ప్రకారం చెబుతున్నారు. గ్రామంలో పలురకాల వ్యాధులతో సుమారు 20మంది మంచం పట్టి ఉన్నారు. అభివృద్ధి చెందుతున్న గ్రామంలో కేన్సర్ మహమ్మారి అంటూ అలజడి సృష్టించడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు.
ఇటీవల గ్రామంలో కేన్సర్ భూతం ఉందని అని ప్రచారం జరగడంతో గ్రామస్తులు, యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా అనిపించడం లేదు. వైద్యాధికారులు తూతూ మంత్రంగా పరీక్షలు నిర్వహించి వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ అధికారులు కేన్సర్ వ్యాధి రావడానికి కారణం ఏమిటో ఎందుకు నిర్ధారణ చేయడం లేదు? గ్రామంలో గాలి కాలుష్యమా? కలుషితమైన తాగునీరా? తినే ఆహారంలో మార్పులవల్ల కేన్సర్ వ్యాధి వస్తోందా? అని ప్రజల్లో ఉన్న అనుమానాలను అధికారులు ఎందుకు నివృత్తి చేయడం లేదని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామంలో అలజడి సృష్టిస్తున్నారు
మా గ్రామ పంచాయతీలో పలు రకాల వ్యాధులతో మృతి చెందుతున్నారు. ప్రస్తుతం ముగ్గురు కేన్సర్ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. గ్రామంలో ప్రత్యేకవైద్య నిపుణుల బృందం పూర్తిస్థాయిలో ఆహారం, నీరు, పరిసరాలను పరిశీలించి గ్రామస్తులకు పరీక్షలు నిర్వహించి ప్రజల్లో ఉన్న భయాందోళన తొలగించాలి.
– కోడి తిరుపతిరావు, సర్పంచ్, గంగరేగువలస
పూర్తిస్థాయి నివేదిక రావాలి
గంగరేగువలస, సోమినాయుడువలస, చినగంగరేగువలస గ్రామాల్లో కేన్సర్ మహమ్మారి ఉందని గ్రామస్తుల్లో అలజడి సృష్టిస్తున్నా రు. వాస్తవానికి ముగ్గురు వ్యక్తులకు మాత్రమే కేన్సర్ వ్యాధి ఉంది. వారు కూడా చికిత్స పొందుతున్నారు. గతంలో కేన్సర్ బారిన పడి మృతి చెందారని ఆరోపిస్తున్న వాటికి పక్కా ఆధారాలు లేవు. ఈ గ్రామంలో కేన్సర్ వ్యాధికి పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించి నివేదిక పంపడానికి సమయం పడుతుంది.
– సీహెచ్ అరుణ్‌కుమార్, వైద్యాధికారి,
కొమరాడ పీహెచ్‌సీ

గంగరేగువలసలో బెంగ..!