
ఎమ్మెల్యేలు డుమ్మా
విజయనగరం అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–2047’ ప్రణాళిక, పీ–4 కార్యక్రమాల తొలి సమీక్ష సమావేశానికి విజయనగరం, నెల్లిమర్ల ఎమ్మెల్యేలు మినహా మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఇది అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ విజన్ ప్రణాళిక అమలులో ప్రతిఒక్కరూ భాగాస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. రానున్న ఐదేళ్లలో వ్యవసాయంలో రెట్టింపు అభివృద్ధి సాధించాలన్నదే లక్ష్యమన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యాన, వాణిజ్యపంటల సాగుకు రైతులు ఆసక్తిచూపేలా చూడాలన్నారు. సర్వీస్ సెక్టార్ కింద పర్యాటక రంగంలో సన్‌రే రిసార్ట్స్ రూ.150 కోట్లు, జీఎంఆర్ రూ.150 కోట్లు, ఆదాని గ్రూప్ రూ.100 కోట్లతో హోటళ్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయన్నారు. పీ–4లో భాగంగా నియోజకవర్గం పరిధిలోని 264 పోలింగ్ బూత్‌ల నుంచి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకుంటానని వెల్లడించారు. సమవేశంలో ఎమ్మెల్సీలు డాక్టర్ గాదె శ్రీనివాసులునాయుడు, రఘురాజు, ఎమ్మెల్యేలు అధితి విజయలక్ష్మి గజపతిరాజు, లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, జేసీ సేతుమాధవన్, ఎస్‌పీ వకుల్ జిందాల్, సీపీఓ బాలాజీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మహిళలకు శక్తియాప్ రక్షక కవచం
మహిళలకు రక్షక కవచంగా శక్తియాప్ నిలుస్తుందని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం అధికారులతో జరిగిన సమావేశంలో శక్తి యాప్ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఎస్పీ వకుల్ జిందాల్ తొలిత శక్తి యాప్ విధి విధానలను పీపీటీలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల, ఆడ పిల్లల రక్షణ కోసం రూపొందించిన ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంతరకు 1.2 కోట్ల మంది వినియోగిస్తున్నారని, ప్రతి మహిళ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.