‘తోటపల్లి’పై కూటమి కినుక
● సాగునీటి కాలువలను బాగు చేయలేదు ● దీనిపై రైతుల పక్షాన పోరాటం చేస్తాం ● నేటి సాయంత్రం కాలువల పరిశీలన కార్యక్రమం ● ఎమ్మెల్సీ విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే కళావతి
పాలకొండ: తోటపల్లి కాలువలను ఆధునీకరించి రైతులకు సాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ధ్వజమెత్తారు. పాలకొండలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సాగునీ టి కాలువల అభివృద్ధిపై ప్రభుత్వం కినుక వహించడాన్ని తప్పుబట్టారు. శిథిలావస్థకు చేరిన నాగావళి కుడి, ఎడమ కాలువల షట్టర్లు బాగుచేయాలని డిమాండ్ చేశారు. షట్టర్లు పాడవ్వడంతో రిజర్వాయర్‌లోని నీరు సాగునీటి కాలువల్లోకి పెద్దస్థాయి లో చేరి గండ్లు పడే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి కే నీరు వృథాగా సరఫరా అవుతూ పంటపొలాల్లో చేరి వ్యవసాయ పనులకు ఆటంకం కలుగుతోందన్నారు. 2023–24 సంవత్సరంలో గత జగన్‌మోహ న్‌రెడ్డి ప్రభుత్వం కొత్త షట్టర్ల ఏర్పాటుకు రూ.20 లక్షలు మంజూరు చేసిందని, టెండర్ల దశలో ఎన్నిక ల కోడ్‌తో పనులు నిలిచిపోయినట్టు తెలిపారు. ఎడమ కాలువ ప్రధాన లింక్ కెనాల్ రక్షణ గోడకు సాంకేతి అనుమతులు తీసుకువచ్చామన్నారు. అనంతరం ప్రభుత్వం మారడంతో ఈ పనులు బుట్టదాఖలయ్యాయన్నారు. కాలువల ఆధునికీకర ణ పనులను పట్టించుకోకపోవడం విచారకరమన్నా రు. ప్రభుత్వం స్పందించి వెంటనే కాలువల షట్టర్లు బాగుచేయాలని, కాలువ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలోని బృందం కాలువల పరిశీలన కార్యక్రమాన్ని చేపడుతుందని వివరించారు. రైతులందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.


