కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా | - | Sakshi
Sakshi News home page

కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా

May 19 2025 4:06 PM | Updated on May 19 2025 4:06 PM

కార్మ

కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా

జూలై 9న చేపట్టనున్నట్లు వెల్లడి

విజయనగరం గంటస్తంభం: లేబర్‌ కోడ్స్‌కు వ్యతిరేకంగా ఈ నెల 20న కలెక్టరేట్‌ ఎదుట జరగాల్సిన సార్వత్రిక సమ్మె జూలై 9కి వాయిదా పడినట్లు కేంద్ర కార్మిక సంఘాల నేతలు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఐటీయూ, ఏఐఎఫ్‌టీయూ న్యూ, ఇఫ్టూ దేశంలో ఉన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశం ఇంత తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్రప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ లేబర్‌ కోడ్‌ల అమలును దూకుడుగా ముందుకు తీసుకెళ్తోందని విమర్శించారు. కార్మిక సంఘాల హక్కులను కాలరాస్తోందని కేంద్ర కార్మిక సంఘాల నేతలు విమర్శించారు. జూలై 9వ తేదీన సమ్మె జయప్రదం చేసేందుకు సమాయత్తం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆలయంపై పడిన పిడుగు

గంట్యాడ: మండలంలోని పెదవేమలి గ్రామంలో కాళీమాత ఆలయంలో కొలువైన లక్ష్మీగణపతి ఆలయంపై ఆదివారం మధ్యాహ్నం పిడుగు పడింది, పిడుగు శబ్దానికి ఆలయం గోపురం పెచ్చులు ఊడిపోయాయి. ఆలయం కింద భక్తులు ఉన్నప్పటికీ అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

వ్యక్తిపై దాడి కేసు నమోదు

సంతకవిటి: మండలంలోని పొనుగుటివలస గ్రామంలో బొండాడ నారాయణ తమ్ముడి కొడుకు బొండాడ గణేష్‌ శనివారం రాత్రి పెదనాన్న నారాయణపై వెదురు కర్రతో దాడి చేయడంతో గణేష్‌పై కేసు నమోదు చేశామని ఎస్సై ఆర్‌.గోపాలరావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం బొండాడ నారాయణ, బొండాడ గణేష్‌ కుటుంబాల మధ్య ఉన్న పాత తగాదాల నేపథ్యంలో, శనివారం రాత్రి తాగిన మైకంలో గణేష్‌ నారాయణపై దాడి చేయడంతో నారాయణ చేతికి గాయమైంది..దీంతో నారాయణ ఆదివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నారాయణ ప్రస్తుతం శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.

తివ్వాకొండల్లో

ఏనుగుల సంచారం

భామిని: మండలం సరిహద్దుగా గల తివ్వాకొండల్లో ఏనుగుల గుంపు తాగునీటి కోసం తహతహ లాడుతోంది. ఈ మేరకు ఆదివారం భామిని–గుమ్మలక్ష్మీపురం మండలాల సరిహద్దుల్లో ఏనుగుల గుంపు పచార్లు కొట్టినట్లు గిరిజనులు తెలిపారు. రాతి గుట్టల్లో నడుస్తూ నీటి కోసం పయనిస్తున్నట్లు చెప్పారు. ఒక పక్క మండు వేసవితో అల్లాడుతున్న పరిస్థితిలో ఏనుగుల గుంపు అవస్థలు పడుతున్నట్లు తెలియజేశారు.

ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య

మెరకముడిదాం: మండలంలోని ఎం.గదబవలస గ్రామానికి చెందిన ఆరంగి అప్పలనాయుడు (42) ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఆరంగి అప్పలనాయుడు తరచూ మద్యం తాగుతుండడంతో కుటుంబకలహాలు నెలకొన్నాయి, ఈ క్రమంలో మనస్తాపం చెందిన అప్పలనాయుడు ఆదివారం ఇంట్లో ఉన్న ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బుదరాయవలస ఎస్సై జె.లోకేష్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి అప్పలనాయుడు మృతికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా1
1/2

కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా

కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా2
2/2

కార్మిక సంఘాల సార్వత్రిక సమ్మె వాయిదా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement