
ఫీల్డ్ అసిస్టెంట్‌పై ఎంపీడీఓకు ఫిర్యాదు
● పని కల్పించాలంటూ వేతనదారుల ధర్నా
గంట్యాడ: జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనికి వెళ్లే వేతనదారులకు పనికల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ ఫీల్డ్ అసిస్టెంట్‌పై గ్రామసర్పంచ్, వేతనదారులు సోమవారం ఫిర్యాదు చేశారు. పెదవేమలి గ్రామంలో గత వారం 160 మంది వేతనదారులకు పనికల్పించకుండా ఫీల్డ్ అసిస్టెంట్ అలసత్వం వహించారని, ఈవారం కూడా 30 నుంచి 40 మందివరకు వేతనదారులకు పనిలేకుండాచేశారని పెదవేమలి గ్రామ సర్పంచ్ వర్రి పాపునాయుడు ఎంపీడీఓ ఆర్‌వీ రమణమూర్తికి ఫిర్యాదు చేశారు. దీనివల్ల వేతనదారులు నష్టపోతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పని కావాలని వేతనదారులు డిమాండ్ చేస్తున్నప్పటికీ వారికి పని కల్పించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో సదరు ఫీల్డ్ అసిస్టెంట్‌పై తగిన చర్యలు తీసుకుని వేతనదారులకు పనికల్పించాలని కోరారు.
పనికల్పించాలని ధర్నా
అలాగే మండలంలోని నరవ గ్రామానికి చెందిన వేతనదారులు సోమవారం ఎంపీడీఓకార్యాలయం ఎదుట తమకు పని కల్పించాలని ధర్నా నిర్వహించారు. ఉపాధి సిబ్బంది తీరు వల్ల తాము ఉపాధి కోల్పోయామని వాపోయారు.
ఫీల్డ్ అసిస్టెంట్‌గా చలామణి అవుతున్న మహిళపై ఫిర్యాదు
నరవ గ్రామంలో డ్వామా శాఖ నుంచి ఎటువంటి అపాయింట్ మెంట్ ఆర్డర్ లేకుండా షాడో ఫీల్డ్ అసిస్టెంట్‌గా చలామణి అవుతున్న మహిళపై చర్యలు తీసుకోవాలని అదేగ్రామానికి చెందిన నరవ సన్యాసిరావు సోమవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై రెండు సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, పైగా సదరు మహిళకు ఉపాధి హామీ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఫీల్డ్ అసిస్టెంట్ మాదిరి మస్తర్లు పరిశీలించడం, పనులు పురమాయించడం చేస్తున్నారని ఆరోపించారు.