
హృదయాలను తాకిన నాటికలు
చీపురుపల్లి రూరల్(గరివిడి): ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీల్లో భాగంగా గరివిడిలోని శ్రీరామ్ హైస్కూల్ ఆవరణంలో గరివిడి కల్చరల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో జరిగిన నాటికల పోటీలు ఆదివారం ముగిశాయి. ముగింపు రోజున ప్రదర్శించిన కొత్త పరిమళం, చీకటిపువ్వు, దేవరాగం నాటికలు చక్కటి కథా సారాంశాన్ని అందించి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నాయి. బొరివంకకు చెందిన శర్వాణి గ్రామీణ గిరిజన సాంస్కృతిక సేవాసంఘం ఆధ్వర్యంలో ప్రదర్శించిన కొత్త పరిమళం నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. జాతి,మత,కుల,ప్రాంతాల పేరుతో విధ్వంసాలు రేగుతున్న భూమండలంలో ప్రేమ, అభిమానం, అనురాగం అనువణువునా నింపుకుని మనిషిని మనిషి ప్రేమిస్తే ఈ భూమండలం శాంతివనంగా మారుతుందన్న కథా సందేశంతో కొత్త పరిమళం నాటిక ముగుస్తుంది. అదే విధంగా కరీంనగర్‌కు చెందిన చైతన్య కళాబారతి ఆధ్వర్యంలో ప్రదర్శించిన చీకటిపువ్వు నాటిక సమాజంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురైన విలువైన సారాంశాన్ని అందించింది. పరిస్థితులకు ఏ మనిషి అతీతం కాదని, అవసరం ఏర్పడో, అవకాశం లేకనో ప్రతి ఒక్కరూ జీవితంలో తప్పులు చేయడం సహజం. చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపం చెందిన వారిని దూరం పెట్టొద్దని, క్షమించడంలోనే నిజమైన ప్రేమ ఉందని, ప్రాణం పోయిన తరువాత బాధపడే కంటే ఉన్నప్పుడే బాధ్యతగా వ్యవహరించాలంటూ తెలియజెప్పే కథాంశంతో చీకటిపువ్వు నాటిక ముగుస్తుంది. అదేవిధంగా విశాఖపట్నానికి చెందిన సౌజన్య కళాస్రవంతి ఆధ్వర్యంలో ప్రదర్శించిన దేవరాగం నాటిక బలమైన బందాన్ని తెలియజెబుతుంది. రక్త సంబంధాలు, పేగు బంధాలు, అనుబంధాల కంటే మనిషి సహజ లక్షణాలు అనేవి వాటన్నింటినీ మించిన బందం పేగుబంధం. ఈ బంధం విచ్ఛిన్నమైతే తల్లిదండ్రులకు వృద్ధాప్యం శాపమవుతుందని, ఈ బంధం బలంగా ఉంటే వృద్ధాప్యమే ఆ తల్లిదండ్రులకు మధురమైన మలి దశలోని బాల్యం అవుతుందని తెలియజెప్పే కథా సారాంశంతో దేవరాగం నాటిక సమాప్తమైంది.

హృదయాలను తాకిన నాటికలు