
దేవర మహోత్సవానికి సర్వం సిద్ధం
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు దేవర మహోత్సవ ఘట్టం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి నుంచి చదురుగుడికి అమ్మవారిని తీసుకువచ్చే అద్భుతమైన అపురూప ఘట్టానికి అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి వనంగుడిలో స్తపన మందిరంలో అమ్మ ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. వేదపండితుల వేదమంత్రోచ్చారణలతో పూజారి బంటుపల్లి వెంకటరావు, భక్తుల చేతుల మీదుగా అమ్మవారిని అప్పటికే ఆలయం బయట పుష్పాలతో సిద్ధం చేసిన ఉత్సవరథంపై ఆశీనులను చేస్తారు. జయజయ ధ్వానాల మధ్య బాజాభజంత్రీలు, విచిత్ర వేషధారణలు, కోలాటం బృందాలు, డముకు వాయిద్యాలతో రైల్వేస్టేషన్ నుంచి గాడీకానా, సీఎంఆర్ జంక్షన్, వైఎస్సార్ సర్కిల్, ఎన్‌సీఎస్ రోడ్, కన్యకపరమేశ్వరి ఆలయం, గంటస్తంభం, శివాలయం వీధి మీదుగా హుకుంపేటలో ఉన్న పూజారి ఇంటికి తీసుకువెళ్తారు. అక్కడ రాత్రి 10 గంటల సమయంలో ఘటాలతో అమ్మవారికి నివేదన చేస్తారు. అమ్మవారికి మనవి చెప్పిన అనంతరం కోటలో కొలువైన కోటశక్తికి పూజలు చేస్తారు. వేకువజామున 3 గంటల ప్రాంతంలో అమ్మవారు సాక్షాత్కరించిన పెద్దచెరువు పశ్చిమభాగానికి ఘటాలతో చేరుకుని మనవి చెప్పి పసుపు, కుంకుమలతో పూజలు చేసి, ఘటాల్లో పసుపు, కుంకుమలతో పాటు పూజ చేసిన అక్షింతలను తీసుకుని మంగళవారం వేకువజామున 5 గంటలకు చదురుగుడికి చేరుకుంటారు.
ఇన్‌చార్జ్ ఈఓ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
అనంతరం ఆలయంలో అమ్మవారికి డప్పువాయిద్యాలు, సన్నాయి మేళంతో పూజలు చేసి, ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తరువాత 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ అపురూప ఘట్టాలను తనివితీరా చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ నేత్రత్వంలో అమ్మవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర చివరి ఘట్టమైన ఉయ్యాల కంబాల మహోత్సవం తర్వాత రోజున బుధవారం మళ్లీ అమ్మవారు చదురుగుడి నుంచి వనంగుడికి చేరుకుంటారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని ఆలయ ఈఓ ప్రసాద్ కోరారు.
సోమవారం సాయంత్రం 4 గంటల
నుంచి ఊరేగింపు
మంగళవారం నుంచి చదురుగుడిలో అమ్మవారి దర్శనం