రాకెట్‌ వేగంతో ముంచేశాడు! | - | Sakshi
Sakshi News home page

రాకెట్‌ వేగంతో ముంచేశాడు!

May 18 2026 6:39 AM | Updated on May 18 2026 6:39 AM

రాకెట్‌ వేగంతో ముంచేశాడు!

ఒక్కొక్కటిగా వెలుగులోకి వెంకట్రావు లీలలు రూ.10 వేలు కడితే రూ.10 కోట్లు ఇస్తానని మోసం చిలకలూరిపేట రూరల్‌ స్టేషన్‌లో గతంలో బాధితుల ఫిర్యాదు ఆర్థిక మోసాలను నరసరావుపేటకు విస్తరించిన వెంకట్రావు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వేల సంఖ్యలో బాధితులు ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తింపు

వేల మంది బాధితులు...

సాక్షి, నరసరావుపేట: అతడు నోరు విప్పితే రాకెట్‌, నాసా, ఇస్రో, సోలార్‌ సిస్టమ్‌, స్విస్‌ బ్యాంక్‌, టాక్స్‌ ఫ్రీ... వంటి పదాలను అలవోకగా మాట్లాడుతుంటాడు. ఇవన్నీ చూసి ఏ నాసా శాస్త్రవేత్తో అనుకుంటే వేలాది మంది బాధితుల జాబితాలో మీరూ చేరినట్టే. అతనో గ్రాడ్యుయేషన్‌ కూడా పూర్తి చేయని ఆర్థిక నేరస్థుడు. ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకొని ఎదగాలనుకునే మనస్తత్వం అతినిది. అతనే చిలకలూరిపేట రూరల్‌ మండలం గొట్టిపాడుకు చెందిన నాగండ్ల వెంకట్రావు. మొదట్లో ఆటో డ్రైవర్‌గా పనిచేశాడు. ఇలా రూ.కోట్లు సంపాదించలేమని అనుకున్నాడో ఏమో.. తనకు పరిచయమైన కొందరు కేటుగాళ్లతో కలసి రాకెట్‌ ల్యాబ్‌ పేరిట కొత్త దందాకు తెరదీశాడు.

దండుకోవడమే పని

రూ.10 వేలు కడితే రూ.10 కోట్లు ఖాతాలో వేస్తామంటూ నమ్మించాడు. సింగపూర్‌ బ్యాంక్‌ ఖాతాలో రూ.3 లక్షలు జమ అయ్యాయని, వాటిని తీసుకోవాలంటే ఈ– కేవైసీతోపాటు మరో రూ.3,500 కట్టాలంటూ ప్రజల అత్యాశను ఆసరాగా చేసుకొని మరికొంత దండుకునే ప్రయత్నం చేశాడు. అతని కుమారుడు వంశీ, పీఏ నీరజల సహాయంతో మూడు రోజుల క్రితం నరసరావుపేట ఎస్‌ఆర్‌కేటీ కాలనీలో రాకెట్‌ ల్యాబ్‌ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. ఈ సమాచారంతో శనివారం నరసరావుపేట రూరల్‌ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక రెవెన్యూ సిబ్బంది ఫిర్యాదుతో వెంకట్రావు, వంశీ, పీఏ నీరజలపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కిషోర్‌ తెలిపారు.

అప్పుడే అప్రమత్తమై ఉంటే...

నాగండ్ల వెంకట్రావు తొలుత స్వగ్రామం గొట్టిపాడులో నాసా పేరుతో ఇదే తరహా మోసానికి పాల్పడ్డాడు. ఇందులో ఓ 20 మంది ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వారి నుంచి రూ.2 లక్షల వరకు వసూల్‌ చేసి మోసం చేశాడు. దీనిపై వెంకట్రావుపై అదే గ్రామానికి చెందిన చప్పిడి బాలస్వామి ఫిర్యాదుతో ఈ ఏడాది మార్చి 9వ తేదీన చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులకు ఇవ్వాల్సిన నగదు వెనక్కి ఇచ్చిన వెంకట్రావు ఫిర్యాదుదారులపై కౌంటర్‌ కేసులు, మీడియా సమావేశాలతో బెదిరింపులకు దిగాడని సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులపై సైతం వెంకట్రావు బెదిరింపులకు దిగినట్టు తెలిసింది. ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారించి అతడి ఆట కట్టించి ఉంటే నరసరావుపేటలో రాకెట్‌ ల్యాబ్‌ పేరుతో మరోసారి ఇలా మోసానికి దిగేవాడు కాదని బాధితులు వాపోతున్నారు.

చిలకలూరిపేట, నరసరావుపేటలతోపాటు రెండు తెలుగు రాష్ట్రాలలో వేల సంఖ్యలో రాకెట్‌ ల్యాబ్‌ బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. నరసరావుపేట రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేశారనే సమాచారం తెలుసుకున్న కొందరు బాధితులు కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి ఫోన్లు చేస్తున్నారు, తాము వచ్చి వెంకట్రావు మోసాలపై ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు. ఇంత జరిగినా పోలీసు విచారణలో వెంకట్రావు మాత్రం తాను నిజాయతీపరుడినేనని చెబుతున్నట్లు సమాచారం. చందాదారులు అనవసరంగా హైరానా పడ్డారని, స్విస్‌ ఖాతాలలో తప్పకుండా నగదు జమ అవుతాయని చెప్పారు. కేరళ నుంచి తమ భాగస్వామి వచ్చి మొత్తం వివరిస్తాడని నమ్మబలుకుతున్నాడట. ఏది ఏమైనా ఇప్పటికే పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో యూపిక్స్‌ స్కాం, సాయిసాధన చిట్‌ఫండ్స్‌ స్కాంలతోపాటు పలువురు వ్యాపారులు ఐపీ పెట్టడంతో గతేడాదిగా వరుస ఆర్థిక మోసాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వం, పోలీసులు గట్టిగా వ్యవహరించకపోతే మరింత మంది బాధితులు నష్టపోయే ప్రమాదముంది.

Advertisement
 
Advertisement
Advertisement