గర్భిణుల వద్దకే వైద్యం | - | Sakshi
Sakshi News home page

గర్భిణుల వద్దకే వైద్యం

May 17 2026 7:02 AM | Updated on May 17 2026 7:02 AM

మొన్నటి వరకు మూడవ అంతస్తులో రక్త, మూత్ర పరీక్షలు

మెట్లు ఎక్కలేక గర్భిణుల తీవ్ర ఇబ్బందులు

‘సాక్షి’ కథనంతో గ్రౌండ్‌ఫ్లోర్‌కు పరీక్ష కేంద్రం మార్పు

సమస్య తీరటంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రోగులు

నరసరావుపేట టౌన్‌: ప్రభుత్వ ఏరియా వైద్యశాల్లో గర్భిణుల రక్త పరీక్షల కోసం పడుతున్న తీవ్ర ఇబ్బందులపై గర్భిణుల సహనానికే పరీక్ష అన్న శీర్షికతో ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. పల్నాడు బస్టాండ్‌ వద్ద ఉన్న పాత వైద్యశాల భవనం శిథిలావస్థకు చేరింది. దీంతో లింగంగుంట్లలో నిర్మించిన 200 పడకల ప్రభుత్వ ఏరియా వైద్యశాల్లో 15 రోజుల క్రితం గైనిక్‌ విభాగాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే గ్రౌండ్‌ఫ్లోర్‌లో గైనిక్‌ విభాగాన్ని ఏర్పాటు చేసి రక్త, మూత్ర పరీక్షల నిర్వహణ మాత్రం మూడవ అంతస్తులో ఏర్పాటు చేశారు. ఉన్న లిఫ్ట్‌ సాంకేతిక సమస్యతో తరుచూ మోరాయిస్తుంది. లిఫ్ట్‌ సరిగ్గా పనిచేయకపోవటంతో గర్భిణులు రక్త, మూత్ర పరీక్షల కోసం మూడు అంతస్తుల మెట్లు ఎక్కుతూ నానా అవస్థలు పడుతున్నారు. మరొకరి సహాయంతో ఇబ్బందులు పడుతూ పరీక్షల కేంద్రానికి చేరుకుంటున్నారు. దీనిపై స్పందించిన వైద్యాధికారులు రక్త సేకరణ కేంద్రాన్ని గ్రౌండ్‌ఫ్లోర్‌లో శనివారం ఏర్పాటు చేశారు. ఇద్దరు సిబ్బంది అక్కడ విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. వచ్చిన గర్భిణుల వద్ద నుంచి బ్లడ్‌ శాంపిల్స్‌ను సేకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement