బ్రేకుల్లేని అద్దె కార్ల దందా | - | Sakshi
Sakshi News home page

బ్రేకుల్లేని అద్దె కార్ల దందా

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

● నరసరావుపేటలో డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకున్నా బాడుగకు కార్లు ● సెల్ఫ్‌ డ్రైవింగ్‌పై మోజులో ఆకర్షితులవుతున్న యువత ● తక్కువ అద్దెకే వస్తుండటంతో ఆసక్తి ● అనుభవలేమి కారణంగా అధిక ప్రమాదాలు ● తాజాగా ముప్పాళ్ల వద్ద ఇద్దరు యువకులు బలి ఇది అద్దె కార్ల అక్రమ కథ.. పెరుగుతున్న ప్రమాదాలు..

అధికారులకు బాధ్యత లేదా ?

లైసెన్స్‌ లేకుంటే ప్రమాదమే ..

చేతిలో స్టీరింగ్‌.. కళ్లకు కూలింగ్‌ గ్లాస్‌.. పక్కన ఫ్రెండ్స్‌తో చిట్‌ చాట్‌.. ఆకాశమే హద్దుగా డ్రైవింగ్‌.. ఈ రకమైన ఎంజాయ్‌మెంట్‌కు యువత ఆకర్షితులవుతుంటే.. అద్దె కార్ల ఆఫీసులు ప్రోత్సాహక కేంద్రాలుగా మారుతున్నాయి. డ్రైవింగ్‌ నిబంధనలు కూడా తెలియని జోరులో యువత రయ్‌మంటూ రోడ్లపై దూసుకుపోతుంటే అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. చేతిలో కాసులు పడితే.. ఎవరికై నా కీస్‌ అందిస్తామంటూ రూల్స్‌ను కార్ల చక్రాల కింద తొక్కిపెడుతుంటే.. బిడ్డల నిండు ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రుల కన్నీళ్లు అధికారుల నిద్రమత్తును నిలదీస్తున్నాయి. నరసరావుపేట కేంద్రంగా సాగుతున్న అద్దె కార్ల దందా మూడు పువ్వులు ఆరు కాయలు కాగా.. అనుభవం లేని యువత చేతిలో చక్రాలు రోడ్లపై నెత్తుటి ధారలు పారిస్తున్నాయి.

నరసరావుపేట టౌనన్‌్‌ : అద్దె కార్ల నిర్వాహకుల ఇష్టారాజ్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతోంది. కనీస నిబంధనలు పాటించకుండా మైనర్‌ యువకులకు, డ్రైవింగ్‌ లైసెనన్స్‌ లేని వారికి సైతం అద్దె కార్లు ఇస్తుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. రెండు రోజలు క్రితం మాదల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడిన ఘటన అద్దె కార్ల బాగోతాన్ని బట్టబయలు చేసింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీస్‌ అధికారులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సెల్ఫ్‌ డ్రైవింగ్‌ చేస్తూ వచ్చిన ఇంజనీరింగ్‌ విద్యార్థి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదానికి కారణమైన విషయాలపై తీగ లాగితే అద్దె కార్ల అక్రమ డొంక వెలుగులోకి వచ్చిందని ముప్పాళ్ల ఎస్‌ఐ అనిల్‌ తెలిపారు. నరసరావుపేట పట్టణంలో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కోసం కారు అద్దెకు తీసుకున్నాడని, డ్రైవింగ్‌ చేసిన విద్యార్థికి కనీసం లైసెనన్స్‌ కూడా లేదని స్పష్టం చేశారు. ఆ వ్యక్తికి కారు అద్దెకు ఇచ్చినందుకు యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో పెట్లూరివారిపాలెం వద్ద మరో వ్యక్తిని ఢీకొట్టిన వైనం వెలుగుచూసింది.

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో అద్దె కార్ల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే పలువురు నిర్వాహకులు కార్యాలయాలు ఏర్పాటు చేసి పెద్ద సంఖ్యలో కార్లను అద్దెకు ఇస్తున్నారు. కార్లు బాడుగకు ఇచ్చే సమయంలో డ్రైవింగ్‌ లైసెన్‌న్స్‌ గానీ, వారి అనుభవంగానీ పరిశీలించడం లేదు. చేతిలో కాసులు పడితే చాలు కారు కీస్‌ అందిస్తున్నారు. ఒక్కో కారుకు రోజుకు రూ.2 వేలు, లగ్జరీ కారుకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ప్రైవసీ ఉంటుందని ట్రావెల్స్‌ కార్ల కంటే సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్ల వైపే యువత ఆకర్షితులవ్వడంతో నిర్వాహకులు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు కార్లు అద్దెకు తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు.

అద్దె కార్లు తీసుకొని మితిమీరిన వేగంతో వెళ్లటం వల్ల రోజురోజుకూ ప్రమాదాలు పెరుగుతున్నాయి. 20 రోజుల క్రితం పెట్లూరివారిపాలెం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని అద్దె కారు తీసుకొని సెల్ఫ్‌ డ్రైవింగ్‌తో వచ్చిన యువకుడు ఢీకొనడంతో మృతి చెందాడు. గతంలో ప్రకాష్‌నగర్‌ సెయింట్‌ జోసఫ్‌ పాఠశాల వద్ద మైనర్‌ కారుతో బీభత్సం సృష్టించాడు. సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా ముప్పాళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎంతో భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకులను కారు రూపంలో మృత్యువు కబళించింది. ఇలాంటి వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ఈ వ్యవహారంలో నియంత్రణ పెంచాల్సిన అవసరం ఉంది.

రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనం లైసెన్స్‌, ఫిట్‌ నెస్‌, వాహనాన్ని నడిపే వ్యక్తికి డ్రైవింగ్‌ లైసెనన్స్‌, ఇన్సూరెన్స్‌... ఇలా అన్ని నిబంధనలు పరిశీలించాలి. అలాంటిది నరసరావుపేట కేంద్రంగా అద్దె కార్ల దందా కొనసాగుతుంటే అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా జరిగిన ప్రమాదంలో అద్దె కార్ల కారణంగా ఇద్దరి నిండు ప్రాణాలు బలయ్యాయి. వారి తల్లిదండ్రుల తీరని శోకానికి ఎవరు సమాధానం చెప్పాలని ప్రజలు నిలదీస్తున్నారు. ఇప్పటికై నా అద్దె కార్ల దందాపై పోలీసులు, రవాణా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. అద్దె కార్ల ఆఫీసులు ఏర్పాటు చేసే క్రమంలో కనీసం నిబంధనలు పాటిస్తున్నారా .. లేదా .. అనే విషయాలను పరిశీలించాలి. వాహనాల ఫిట్‌నెస్‌తోపాటు ఎవరికి అద్దెకు ఇస్తున్నారో రికార్డులు నిర్వహించేలా చూడాలని కోరుతున్నారు.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపటం చట్ట విరుద్ధమే కాకుండా అత్యంత ప్రమాదకరం. కారు నడిపే వ్యక్తికి లైసెన్స్‌ లేకుంటే అనుకోని సంఘటన జరిగి మృత్యువాత పడినప్పుడు వారి కుటుంబాలకు ప్రభుత్వపరంగా, న్యాయపరంగా ఎటువంటి పరిహారం అందదు. ముఖ్యంగా డ్రైవింగ్‌ అనుభవం లేకపోవటం వల్ల వాహనం నడిపే వ్యక్తితోపాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయి. కారు నడిపే మోజులో యువత అద్దె కారులు తీసుకొని మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. వచ్చీరాని డ్రైవింగ్‌ చేస్తూ ఎదుటి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement