ముగిసిన నరసింహుని జయంతి వేడుకలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన నరసింహుని జయంతి వేడుకలు

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

ముగిసిన నరసింహుని జయంతి వేడుకలు

రాజాధి రాజ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం

మంగళగిరి టౌన్‌: మంగళగిరి పట్టణంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో జరుగుతున్న నృసింహుని జయంతి ఉత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఉదయం ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ నారసింహస్వామి ఉత్సవమూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాపూర్ణాహుతి హోమం, నరసింహ మూలమంత్ర హోమం అనంతరం శాంతి కల్యాణం చేశారు. సాయంత్రం రాజాధిరాజ వాహనంపై స్వామివారు గ్రామోత్సవంలో దర్శనమిచ్చారు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. జయంతి ఉత్సవాల శాశ్వత కై ంకర్యపరులుగా మాల్యవంతం లక్ష్మీ నరసింహాచార్యులు, శేషమ్మ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్‌ పర్యవేక్షించారు.

కమనీయం రంగనాథుడి కల్యాణం

యడ్లపాడు: సొలస గ్రామంలోని శ్రీభూదేవి సమేత రంగనాయకస్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభతో పరవశించిపోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ మండపాన్ని సుగంధభరిత పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వేదికపై నూతన వధూవరులుగా ముస్తాబైన శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథుడి కల్యాణ మహోత్సవం గురువారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు పర్చూరి రామకృష్ణమాచార్యులు నేతృత్వంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, ఉలూఖల గౌరీ పూజల అనంతరం వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కల్యాణం భక్తులు తిలకించి పులకించిపోయారు. ఎదుర్కోలు ఉత్సవం సందర్భంగా గ్రామ భక్త బృందం చేసిన కోలాట నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శుక్రవారం కల్యాణానంతరం హోమం, బలిహరణ కార్యక్రమాలు జరిగాయి. స్వామివారు గరుడ వాహనంపై రథోత్సవంలో పురవీధుల్లో ఊరేగుతుండగా, గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో నీరాజనాలు అర్పించారు. ఈవో నెమలిరెడ్డి పర్యవేక్షణలో ధర్మకర్తలు అర్వపల్లి మనోహర్‌–నాగజ్యోతి దంపతులు, అర్వపల్లి బ్రదర్స్‌, గ్రామ పెద్దలు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

వేసవి క్రీడా శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: వేసవి క్రీడా శిక్షణకు తమ పిల్లల్ని పంపించి వారిలోని సృజనాత్మతకు, ప్రతిభకు తల్లిదండ్రులు దోహదపడాలని జిల్లా కలెక్టర్‌ సి.యం.సాయికాంత్‌ వర్మ పేర్కొన్నారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్‌ క్రీడా కోచింగ్‌ క్యాంప్‌ల పోస్టర్‌ను శుక్రవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌, జేసీ అశుతోష్‌ శ్రీవత్సవ ఆవిష్కరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్నారులకు సెలవుల్లో కనీస ఆటవిడుపుతోపాటు చక్కని ఆరోగ్యం కూడా వేసవి శిక్షణ ద్వారా లభిస్తాయన్నారు.

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అఫ్రోజ్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement