అంతర్‌ జిల్లా బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ జిల్లా జట్టు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ జిల్లా జట్టు ఎంపిక

May 2 2026 7:32 AM | Updated on May 2 2026 7:32 AM

అంతర్‌ జిల్లా బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌ జిల్లా జట్టు ఎంపిక గుంటూరు జీజీహెచ్‌లో వైద్యుల వివాదం

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో రామచంద్రపురంలో జరగనున్న అంతర్‌ జిల్లాల జూనియర్‌ బాల, బాలికల బాస్కెట్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌కు గుంటూరు జిల్లా జట్టు ఎంపిక శుక్రవారం నిర్వహించారు. లక్ష్మీపురంలోని పాటిబండ్ల సీతారామయ్య సీబీఎస్‌ఈ పాఠశాలలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఏపీ స్టేట్‌ బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జీఎస్‌సీ బోస్‌, కోశాధికారి రేవతి, జిల్లా బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పాటిబండ్ల విష్ణువర్ధన్‌, చీఫ్‌ సెలెక్టర్‌ గుంటుపల్లి హరగోపాల్‌ సమక్షంలో శిక్షకులు సీహెచ్‌ శ్రీనివాసరావు, అనిల్‌, రవికుమార్‌ పర్యవేక్షించారు. అంతర్‌ జిల్లాల జూనియర్‌ బాల, బాలికల బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌కు గుంటూరు జిల్లా జట్టు తరుపున బాలుర విభాగం నుంచి షణ్ముఖ్‌, రూపేష్‌, మణికంఠ, అఖిల్‌, జాన్‌ ప్రడ్డి పాల్‌, జయ రామ్‌, అఖిల్‌, విజయ్‌, ప్రత్యుష, సత్య, ఈశ్వర్‌ దినేష్‌ స్టాండ్‌ బై గా గిరి, హర్షిత్‌, ఆకాష్‌, రుత్విక్‌, బాలికల విభాగం నుంచి యోగ శ్రీ, మానస, అక్షయ, కుండానే, కావ్య, జుబేరియా, శ్రీ లక్ష్మి, ఫర్హానా, ఈషా, ప్రణతి, సహస్ర, సాయి శ్రీ స్టాండ్‌ బైగా బృంద, జస్విత, ప్రణీత, బ్లేస్సిలను ఎంపిక చేశారు.

డాక్టర్‌ తనపై దాడి చేశాడంటూ

విభాగాధిపతి ఫిర్యాదు

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌లో విధుల కేటాయింపులో వివాదం ఏర్పడి ఓ డాక్టర్‌ ఓ విభాగాధిపతిపై దాడిచేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. తనపై దాడిచేసిన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలంటూ విభాగాధిపతి లిఖితక పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జీజీహెచ్‌ ఆర్ధోపెడిక్‌ విభాగాధిపతిగా, ఎమర్జెన్సీ మెడిసిన్‌ ఇన్‌చార్జిగా డాక్టర్‌ పాటిబండ్ల అనిల్‌బాబు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఎమర్జెన్సీ మెడిసిన్‌ ఇన్‌చార్జి విధులు చేపట్టిన డాక్టర్‌ అనిల్‌బాబు ఎమర్జెన్సీ మెడిసిన్‌లో రోగులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు రోడ్డు ప్రమాద బాధితులు, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు పలువురు క్యాజువాల్టి మెడికల్‌ ఆఫీసర్‌లకు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు (సీఏఎస్‌) విధులు కేటాయించారు. జీజీహెచ్‌లో క్యాజువాల్టీలో పనిచేస్తున్న సీఏఎస్‌లను క్యాజువాల్టి మెడికల్‌ ఆఫీసర్‌ అని కూడా పిలుస్తారు. వీరు మూడు షిఫ్ట్‌లు క్యాజువాల్టిలో అందుబాటులో ఉండి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. మే నెలకు సంబంధించి డ్యూటీ రోస్టర్‌ వేసిన పిదప క్యాజువాల్టిలో విధులు నిర్వహించకుండా ఆర్‌ఎంఓ రూములో డాక్టర్‌ గురుప్రసాద్‌ ఉండటంపై డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ప్రశ్నించారు. దీంతో ఇరువురి మధ్య వాదోపవాదాలు జరిగి డాక్టర్‌ గురుప్రసాద్‌ తనను అసభ్యంగా మాట్లాడి, కర్రతో దాడి చేసేందుకు ప్రయత్నించారని, డ్యూటీలు సక్రమంగా నిర్వహించేలా తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఆసుపత్రి అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు.

ఉన్నవ గ్రామంలో చోరీ

యడ్లపాడు: మండల పరిధిలోని ఉన్నవలో పట్టపగలే గర్తు తెలియని దుండగులు ఇంట్లో చోరీ చేసినట్లు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చెన్నుపాటి కృష్ణవేణి రోజువారీ కూలి పనులకు వెళ్లి, సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వచ్చారు. ఆ సమయంలో పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్లారు. ఆమె ఇంటి లోపలికి వెళ్లి చూడగా, అల్మారాలోని దుస్తులు చిందరవందరగా పడి ఉన్నాయి. అల్మారా తలుపులు తీసి ఉండటంతో పాటు, లోపల ఉన్న లాకర్‌ కూడా తెరిచి ఉండటాన్ని ఆమె గమనించారు. ఆందోళనతో లాకర్‌ను పరిశీలించగా, అందులో దాచిన సుమారు 48 గ్రాముల బంగారం గొలుసు, చెవిపోగులు వంటి విలువైన ఆభరణాలు మాయమైనట్లు గుర్తించారు. బాధితులరాలి ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ టి.శివరామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

శావల్యాపురం: మండలంలోని కనమర్లపూడి గ్రామం శివారు పరిధిలోని వెంకటేశ్వర నగర్‌ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై మోర్ల వెంకటేష్‌బాబు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని శానంపూడి గ్రామానికి చెందిన దాసరి మరియబాబు (35) బైకుపై వినుకొండ నుంచి స్వగ్రామానికి వస్తుండగా మార్గంమధ్యలోని వెంకటేశ్వరనగర్‌ సమీపాన ఏదురుగా వస్తున్న ఆర్టీసీ ఢీకొనటంతో రోడ్డుపై పడి కుడి కాలు విరిగిపోవటంతో సత్వరమే 108 అత్యవసర వాహనంలో వినుకొండ ప్రభుత్వ వైద్యశాల తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రక్తం అధికంగా పోవటంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై మోర్ల వెంకటేష్‌బాబు తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.ఆర్టీసి డ్రైవరు సమయస్ఫూర్తితో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement