ఈపూరు(శావల్యాపురం): ఈపూరు మండలం చిట్టాపురం గ్రామ పంచాయతీ శివారు పోనుగోటివారిపాలెం గ్రామంలో అతిసార ప్రబలింది. గ్రామంలోని ఆర్వో ప్లాంటు ద్వారా సరఫరా అయిన కలుషిత నీరు తాగడంతోనే అతిసార వ్యాప్తి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు. 20 మందికిపై అతిసార బారిన పడ్డారు. ఈ నెల 26న పులి సుజాత, వడ్లమూడి కోటయ్య, వడ్లమూడి అంజమ్మ, గుంటుపల్లి వెంకట కోటమ్మ, బోయపాటి మస్తానమ్మ, వడ్లమూడి మల్లమ్మ, యడవల్లి లింగమ్మ, గుంటుపల్లి వెంకట నరసమ్మ, గుంటుపల్లి రామారావు, వడ్లమూడి కోటేశ్వరరావు, గుంటుపల్లి అంజమ్మ, వడ్లమూడి హనుమంతరావు, వడ్లమూడి ధనలక్ష్మి, వడ్లమూడి అంజమ్మ వాంతులు, నీళ్ల విరోచనాలతో అనారోగ్యానికి గురయ్యారు. అతిసార లక్షణాలు ఉన్న రోగులు మొదట నరసరావుపేట, ముప్పాళ్ళ వైద్యశాలల్లో చికిత్స తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న ఆరోగ్య సిబ్బంది, ముప్పాళ్ళ ఆరోగ్య కేంద్రం ద్వారా వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు. సోమవారం జిల్లా వైద్యా ఆరోగ్య అధికారి డాక్టరు బి.రవి గ్రామంలోని రామాలయం సమీపాన టెంటు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలు గురించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంటు తాగునీరు కలుషితం కావటం వలన ఈ సమస్య వచ్చిదన్నారు. తక్షణమే ఆర్వో ప్లాంటు తాత్కాలికంగా మూత వేయించామని చెప్పారు. ఇందులో నుంచి సరఫరా అయిన నీటి నమూనాలను సేకరించి గుంటూరు జిల్లా రీజనల్ ల్యాబ్‌కు పంపిచారు. ఎండ తీవ్రత అధికంగా ఉందని అలాగే గ్రామంలో మిరప పంటలపై వినియోగించే రసాయనాల ప్రభావం లేకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేవని ప్రజలు వదంతులు నమ్మరాదన్నారు. కాచి వడి చల్లార్చిన నీరు తాగాలని సూచించారు. తినిబోయే ముందు చేతులు సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలన్నారు. వాంతులు, విరోచనాలు అయిన వారిని తక్షణమే శిబిరం దగ్గర చికిత్స తీసుకోవాలని చెప్పారు. సర్పంచ్ వడ్లమూడి రాఘవయ్య, డెప్యూటీ డీఎంహెచ్‌వో మక్కెన పద్మావతి, ఆర్‌డబ్యూఎస్ చంద్రశేఖర్, ఆర్‌బీకేఎస్ అధికారి రాజేశ్వరి, ఎంపీహెచ్‌ఈవో సుబ్రమణ్యం ఉన్నారు.


