ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే చర్యలు
నరసరావుపేట టౌన్: ప్రభలపై అశ్లీల నృత్యాలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని ఆర్డీవో మధులత హెచ్చరించారు. ప్రభల నిర్వాహకులతో గురువారం ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రానున్న మహాశివరాత్రిని పురస్కరించుకొని కోటప్పకొండ వద్ద ప్రభలు ఏర్పాటు చేసే నిర్వాహకులు నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. పోలీస్, రెవెన్యూ శాఖల ముందస్తు అనుమతి తప్పనిసరిగా పొందాలన్నారు. ప్రతి ప్రభ దగ్గర అగ్ని ప్రమాదాల నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలన్నారు. ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని నిర్దేశించిన సమయంలో కోటప్పకొండ వద్దకు చేరుకోవాలన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభల నిర్వాహకులను బైండోవర్ చేస్తామన్నారు. ఏ ప్రభ వద్దనైనా సరే అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే ఆయా ప్రభ నిర్వాహకులను బాధ్యులను చేస్తామన్నారు. భక్తిశ్రద్ధలతో ప్రభలపై నృత్యాలు చేసుకోవాలన్నారు. ప్రభలపై కవ్వింపు చర్యలకు పాల్పడే విధంగా పాటలు పాడటం నిషేధమన్నారు. నరసరావుపేట, చిలకలూరిపేట తహసీల్దార్‌లు వేణుగోపాల్, హుస్సేన్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న ఆర్డీవో మధులత


