ట్రాఫిక్‌ చిక్కులు | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ చిక్కులు

Jan 25 2026 7:18 AM | Updated on Jan 25 2026 7:18 AM

ట్రాఫ

ట్రాఫిక్‌ చిక్కులు

పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో వేధిస్తున్న ట్రాఫిక్‌ సమస్య 1.50 లక్షల జనాభాతో పాటు నిత్యం వేలాది మంది పేటకు రాక పట్టణంలో పనిచేయని ట్రాఫిక్‌ సిగ్నల్స్‌.. ట్రాఫిక్‌ సిబ్బంది కొరత రోడ్ల వెడల్పు, మల్లమ్మ సెంటర్‌లో ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని పట్టించుకోని ప్రభుత్వం

పార్కింగ్‌ ప్రదేశాలు లేకనే సమస్య

నరసరావుపేట టౌన్‌: జిల్లా కేంద్రం నరసరావుపేటలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకు జఠిలంగా మారుతోంది. పట్టణంలో 1.50 లక్షలకు పైగా ఉన్న జనాభాకు తోడు ప్రతిరోజు వేలాది మంది జిల్లా నలుమూలల నుంచి వివిధ పనుల నిమిత్తం ఇక్కడికి వస్తుంటారు. ఏటికేడు వాహనాల సంఖ్య పెరుగుతున్నా ఆమేరకు ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి సారించక పోవడంతో నిత్యం ట్రాఫిక్‌ చక్రబంధంలో వాహనదారులు, పట్టణవాసులు కొట్టుమిట్టాడుతున్నారు. కొన్ని సమయాల్లో ఉన్నతాధికారులు, నాయకులకు సంబంధించిన వాహనాలకు తోడు ప్రజలు పెద్ద సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండటంతో ప్రధాన సెంటర్లు కిటకిటలాడుతున్నాయి. కొన్ని సార్లు ట్రాఫిక్‌ చిక్కుల్లో ఇరుక్కొని బయట పడటానికి నానా ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు. అంబులెన్స్‌లు సైతం మల్లమ్మ సెంటర్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్న సందర్భాలు ఉన్నాయి. మల్లమ్మ సెంటర్‌లో ఉన్న ట్రాఫిక్‌ సమస్యను తీర్చేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఫ్లైఓవర్‌ నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి అప్పటి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారటంతో ఫ్లైఓవర్‌ నిర్మాణ ప్రతిపాదన దశలోనే నిలిచిపోయింది.

సిబ్బంది లేక.. సిగ్నల్స్‌ పనిచేయక..

ట్రాఫిక్‌ నియంత్రణకు ఐదేళ్ల క్రితం ప్రైవేటు నిర్వాహకులు పట్టణంలో మూడు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఏర్పాటు చేశారు. అవి కొన్ని నెలలుగా పనిచేయటం లేదు. దీంతో ట్రాఫిక్‌ కంట్రోల్‌ చేయడం సిబ్బందికి సవాల్‌గా మారింది. ప్రధానంగా మల్లమ్మ సెంటర్‌, పల్నాడు బస్టాండ్‌, ఆర్‌యూబీ వద్ద నాలుగు వైపుల నుంచి వాహనాలు వస్తుంటాయి. ఇక్కడున్న సిగ్నల్స్‌ పనిచేయక పోవడం, ట్రాఫిక్‌ పోలీస్‌ సిబ్బంది తగినంత మంది లేకపోవటంతో వాహనాల నియంత్రణ సిబ్బందికి తలనొప్పిగా మారింది.

ప్రతిరోజు 80 వేలకు పైగా వాహనాల రాక

నరసరావుపేట పట్టణంలో ప్రతిరోజూ 80 వేలకు పైగా వాహనాలు తిరుగుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు గుర్తించారు. వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, పిడుగురాళ్ల, గుంటూరు తదితర ప్రాంతాల నుంచి పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట కు మల్లమ్మ సెంటర్‌ మీదుగానే పట్టణంలోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే అక్కడ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పనిచేయకపోవటానికి తోడు రోడ్డుకు నాలుగువైపుల ఆక్రమణలు ఉండటంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రరూపం దాల్చుతుంది. ముఖ్యంగా వాణిజ్య, వ్యాపార దుకాణ సముదాయాలు ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటంతో వినియోగదారుల రద్దీ అధికంగా ఉంటుంది. దుకాణాల వద్ద పార్కింగ్‌ ప్రదేశాలు లేకపోవటంతో వెంట తెచ్చిన వాహనాలను రోడ్లపై నిలుపుతున్నారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలు కష్టతరంగా మారింది.

పట్టణంలో ప్రయాణించే వాహనాలకు సరిపడా పార్కింగ్‌ ప్రదేశాలు లేవు. దీనికితోడు సెల్లార్లు లేమి కూడా ట్రాఫిక్‌ సమస్యకు కారణమవుతోంది. ఇతర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వస్తున్నవారు పార్కింగ్‌ చేసుకునే అవకాశం లేకపోవడంతో వాహనాలను రోడ్డుపైనే నిలుపుతుండటంతో నిత్యం సమస్య తలెత్తుతోంది. ఆక్రమణలు తొలగింపునకు చర్యలు చేపట్టాం. ఉన్న సిబ్బందితో పట్టణంలో ఎక్కడా ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం.

– లోకనాథం, ట్రాఫిక్‌ సీఐ.

ట్రాఫిక్‌ చిక్కులు 1
1/2

ట్రాఫిక్‌ చిక్కులు

ట్రాఫిక్‌ చిక్కులు 2
2/2

ట్రాఫిక్‌ చిక్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement