వేమవరంలో పట్టపగలే చోరీ
పిడుగురాళ్ల: ఇంట్లో ఎవరూ లేని సమయంలో పట్టపగలలు చోరీకి పాల్పడిన సంఘటన మాచవరం మండలంలోని వేమవరం గ్రామంలో శుక్రవారం జరిగింది. ఈ సంఘటన సంబంధించి బాధితుడు గుర్రం గురవారెడ్డి తెలిపిన వివరాల మేరకు... రోజు మాదిరిగానే పొలం పనులకు ఇంట్లో మహిళలు వెళ్లారని, తాను పిడుగురాళ్ల పట్టణంలో పనిపై వెళ్లానని చెప్పారు. మధ్యాహ్న సమయంలో దుండగులు ఇంటి వెనుకవైపు నుంచి వచ్చి బీరువా పగలగొట్టి 64 గ్రాముల బంగారు నగలు, రూ. 2 లక్షల నగదు దొంగిలించారని తెలిపారు. ఈ మేరకు మాచవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


