పీఆర్కే తిరిగి వస్తాడు.. ప్రజల మనిషిగానే ఉంటాడు
పీఆర్కే తిరిగి వస్తాడు.. ప్రజల మనిషిగానే ఉంటాడు ● యర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ నియోజక వర్గంలో నాలుగు సార్లు గెలిచి బలమైన నాయకుడుగా ఉన్న పీఆర్కేని కావాలని హత్య కేసులో ఇరికించారన్నారు. ఆయన పై కక్ష్య సాధింపు చర్యలు తీసుకుంటున్నారన్నారు. స్వార్థం కోసం అక్రమ కేసుల్లో ఇరికించారన్నారు. టీడీపీలోని ఇరు వర్గాలు కొట్టుకుంటే పీఆర్కే, పీవీఆర్‌లను ఇరికించారన్నారు. టీడీపీ ప్రభుత్వం 18 నెలలుగా అభివృద్ధి చేయకుండా వ్యవస్థలను నీరుగార్చారన్నారు. పీఆర్కే న్యాయ పోరాటం చేసి కడిగిన ముత్యంలా వస్తాడని, భయపడడని, తామంతా అండగా ఉంటామన్నారు.
● గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యంత దారుణాలు చేస్తున్న ప్రభుత్వంగా చంద్రబాబు సర్కారు మిగులుతుందన్నారు. సంబంధం లేకుండా పీఆర్కే సోదరులను ఇబ్బంది పెడితే సహించేది లేదన్నారు.
● సత్తెనపల్లి సమన్వయకర్త సజ్జల భార్గవ్‌రెడ్డి మాట్లాడుతూ పల్నాడులో పీఆర్కే పై ఇప్పటికే 16 కేసులు నమోదు చేసి ఆయనకు సంబంధం లేని హత్య కేసులో ఇరికించారన్నారు. పీఆర్కేను అణగదొక్కాలంటే సాధ్యం కాదన్నారు.
● వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ఇదేమి రాజ్యాంగం. సంఘీభావానికి కూడా సహించలేరా, కోర్టు దగ్గరకు వస్తామంటే పోలీసులు అడ్డగించారని, హౌస్ అరెస్టు చేశారన్నారు. దుర్మార్గంగా వ్యవహరించి ఏమి సాధిస్తారన్నారు.
న్యాయ పోరాటం చేస్తాం.. విజయం సాధిస్తాం.. అక్రమ కేసులు..నీచ రాజకీయాలు ఎన్నాళ్ళు.. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, సత్తెనపల్లి సమన్వయకర్త సజ్జల భార్గవ్‌రెడ్డి ధ్వజం
మాచర్ల : రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో బ్లడ్ బుక్‌ను నడుపుతున్నారని, చట్టాన్ని చుట్టం చేసుకొని అత్యంత దారుణంగా వైఎస్సార్‌సీపీ నేతలను అణచివేయడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తుందని, ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు సంఘీభావంగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, సత్తెనపల్లి సమన్వయకర్త సజ్జల సుదీర్ భార్గవ్‌రెడ్డి, పొన్నూరు నియోజక వర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, గురజాల వర్గ నాయకులు కేవీలు మాట్లాడారు.