బెదిరించినా ఎదిరించారు! | - | Sakshi
Sakshi News home page

బెదిరించినా ఎదిరించారు!

Dec 12 2025 6:36 AM | Updated on Dec 12 2025 6:36 AM

బెదిరించినా ఎదిరించారు!

బెదిరించినా ఎదిరించారు!

మాచవరం ఎంపీపీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఎంపీటీసీ సభ్యుల దీటు సమాధానం ప్రలోభాలకు లొంగకుండా పార్టీతో ఉంటామని స్పష్టీకరణ అడ్డదారిలో ఎంపీపీ పదవి కోసం టీడీపీ నేతలు చేసిన కుట్రలను అడ్డుకున్న సభ్యులు

ఎన్నిక సాగింది ఇలా...

మాచవరం: మాచవరం మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు ఎంపీటీసీ సభ్యులు టీడీపీ నేతలు, పోలీసుల బెదిరింపులకు లొంగకుండా ఎదిరించి నిలబడ్డారు. ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా మండల సర్వసభ్య ప్రత్యేక సమావేశానికి మొత్తం 14 మంది ఎంపీటీసీ సభ్యులు హాజరు కావాల్సి ఉండగా, 11 మంది వచ్చారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన ముగ్గురు ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి గైర్హాజరు అయ్యారు. టీడీపీకి ఆరుగురు సభ్యులు మద్దతు ఇచ్చారు. టీడీపీ తరఫున పిల్లుట్ల–1 ఎంపీటీసీ సభ్యురాలు కొక్కెర అంజమ్మ ఎంపీపీగా నామినేషన్‌ వేశారు. ఆకు రాజు పల్లి, కొత్త గణేశునిపాడు, వేమవరం, పిల్లుట్ల–2 ఎంపీటీసీలు మద్దతు ఇచ్చారు. వైఎస్సార్‌సీపీ తరఫున మొర్జంపాడు ఎంపీటీసీ సభ్యురాలు ముంగి మంగమ్మ నామినేషన్‌ వేయగా, గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ ముండ్లపాటి సత్యనారాయణ, మల్లవోలు ఎంపీటీసీ చుక్క సువార్తమ్మ, మాచవరం ఎంపీటీసీ మద్దు అనూరాధ మద్దతు ఇచ్చారు. మాచవరం –2 ఎంపీటీసీ చిట్టిప్రోలు గురవయ్య ఓటింగ్‌లో పాల్గొనకుండా తటస్థంగా ఉన్నారు. మెజార్టీ సభ్యులు టీడీపీ మద్దతు ఇవ్వడంతో అంజమ్మను ఎంపీపీగా ప్రకటించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. టీడీపీ నేతలు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీలు పార్టీకి అండగా నిలిచారు. మల్లవోలు సభ్యురాలు చుక్కా సువార్త, మాచవరం సభ్యురాలు మధు అనూరాధ, మొర్జంపాడు సభ్యురాలు ముంగి మంగమ్మ, గంగిరెడ్డిపాలెం ఎంపీటీసీ సభ్యుడు ముండ్లపాటి సత్యనారాయణలు పార్టీపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. వారిని, వారి కుటుంబసభ్యులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి బెదిరింపులకు పాల్పడినా, ప్రలోభాలు చూపినా లొంగకుండా గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్‌ రెడ్డి ఇచ్చిన ధైర్యంతో పార్టీకి మద్దతుగా నిలిచారు.

ఎంపీటీసీ గురవయ్యకు సీఐ బెదిరింపు

సమావేశానికి హాజరయ్యే ఎంపీటీసీ సభ్యులకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పోలీసుల తీరు మారలేదు. మాచవరం ఎంపీటీసీ సభ్యుడు చిట్టిపోలు గురవయ్యను దాచేపల్లి సీఐ భాస్కరరావు సమావేశంలో బెదిరించడంతో ఓటింగ్‌లో తటస్థంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఎంపీటీసీని బెదిరించడాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు తప్పు పట్టాయి. సీఐ తీరుపై ఆక్షేపణ తెలిపాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, బెదిరింపులు వచ్చినా, ప్రలోభాలకు గురిచేసినా పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

బలం లేకున్నా బరితెగింపు

వాస్తవానికి టీడీపీకి తగిన బలం లేకున్నా వైఎస్సార్‌సీసీకి చెందిన ఎంపీటీసీ సభ్యులను బెదిరించి, తమకు మద్దతు ఇవ్వకుంటే అక్రమ కేసులకు గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. అనేక ప్రలోభాలకు గురి చేశారు. బంధువులను పోలీసులు స్టేషన్లకు పిలిపించి బెదిరించారు.

మండలంలో మొత్తం 15 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఎంపీపీ దారం అమ్ములమ్మ ఇటీవల మృతి చెందారు. గత స్థానిక సంస్థ ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలకే పరిమితమైంది. వేమవరం ఎంపీటీసీ శానంపూడి లక్ష్మి, కొత్త గణేశుని పాడు ఎంపీటీసీ చల్లగుండ్ల లక్ష్మయ్య అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ ఫిరాయించారు. దీంతో టీడీపీ బలం నాలుగుకు చేరింది. వైఎస్సార్‌సీపీకి 10 సభ్యులు ఉన్నారు. వీరిలో ప్రలోభాలకు గురి చేయడంతో టీడీపీకి ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు మద్దతు ఇచ్చారు. గంగిరెడ్డిపాలెం సభ్యుడు ముండ్లపాటి సత్యనారాయణ, మాచవరం ఎంపీటీసీ–2 మధు అనూరాధ, ఎంపీటీసీ– 1 చిట్టిప్రోలు గురవయ్య, మొర్జంపాడు ఎంపీటీసీ ముంగి మంగమ్మ, మల్లవోలు ఎంపీటీసీ చుక్కా సువార్తలు వైఎస్సార్‌సీపీలో కొనసాగారు. టీడీపీ తరఫున పిల్లుట్ల–1 ఎంపీటీసీ కొక్కెర అంజమ్మ ఎంపీపీగా నామినేషన్‌ దాఖలు చేయడంతో ఐదుగురు సభ్యులు ఆమెకు మద్దతు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ తరఫున మొర్జంపాడు–1 ఎంపీటీసీ ముంగి మంగమ్మ నామినేషన్‌ వేయగా ముగ్గురు సభ్యులు మద్దతు ప్రకటించారు. కొక్కెర అంజమ్మను ఎంపీపీగా అధికారులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement