అడ్డంకులు దాటుతూ ముందుకు సాగిన మురళీకృష్ణ
మాచర్ల రూరల్: పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వస్తున్న పొన్నూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పల్నాడు పార్టీ జిల్లా అధ్యక్షుడు పీఆర్కేతోపాటు పీవీఆర్‌ను అక్రమంగా కేసులో ఇరికించడంతో కోర్టులో లొంగిపోతున్న వారిని కలిసి మద్దతు తెలిపేందుకు గుంటూరు నుంచి వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు నిలిపివేశారు. వాహనాన్ని, తన అనుచరులను విడిచి ఆయన ఒక్కరే ఆర్టీసీ బస్సులో ఎక్కి మాచర్లకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆ బస్సును నిలిపారు. తనిఖీ చేస్తున్న సమయంలో ఆయన బస్సులోని చివరి సీటులోకి వెళ్లి పడుకొని వారికి కనిపించకుండా మాచర్ల పట్టణ శివారుకు చేరుకున్నారు. ఆ సమయంలో కొందరు పోలీసులు ఆయనను గుర్తుపట్టి అక్కడ నుంచి దించివేశారు. మురళీకృష్ణ పట్టణ శివారులో ఉన్న పొలాల్లో పయనించి ఆ ప్రాంతంలో వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడి సాయం తీసుకొని, అడ్డదారుల్లో ఇబ్బంది పడుతూనే కోర్టు వద్దకు చేరుకొని పిన్నెల్లి సోదరులను కలిసి పార్టీ తరఫున మద్దతు తెలిపారు. మురళీకృష్ణ పట్టుదలతో గమ్యానికి చేరుకున్న తీరును పార్టీ నాయకులు అభినందించారు.


