టీడీపీ కుట్రలకు తగిన రీతిలో సమాధానం చెబుదాం
మాచర్ల రూరల్: చంద్రబాబు ప్రభుత్వం, టీడీపీ నాయకులు కుట్రపూరితంగా, అన్యాయంగా, అక్రమంగా హత్య కేసులో ఇరికించి పిన్నెల్లి సోదరులను వేధిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల అన్నారు. దీనికి కారణమైన నాయకులకు, కొందరు పోలీసులకు తగిన సమయంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గురువారం మాచర్లలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పిన్నెల్లి సోదరులను నిందితులుగా చేర్చటంలో టీడీపీ నేతల కుటిల బుద్ధి బయటపడిందన్నారు. ఈ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిందని, ఆ బెయిల్ రద్దు చేసేందుకు అధికార పార్టీ నాయకులు కుట్ర చేసినట్లు తమకు అర్థం అవుతోందని చెప్పారు. ప్రజల్లోకి పిన్నెల్లి సోదరులు మళ్లీ వచ్చి జగనన్న పాలనను తీసుకు వస్తారని ఆమె స్పష్టం చేశారు. మాజీ కౌన్సిలర్ అన్నెం అనంతరావమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, అరుణ్‌రెడ్డి, పిన్నెల్లి శ్రీనివాసరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శివలింగరాజు, మద్దికర శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల


