పేకాట శిబిరంపై దాడి
ఏడుగురు పురుషులు,
నలుగురు మహిళలు అరెస్ట్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉండవల్లి హరిజనవాడ కరకట్ట వెంబడి పుష్కర కాలనీ సమీపంలో మంగళవారం పేకాట శిబిరంపై టాస్క్‌ఫోర్స్ టీమ్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో ఏడుగురు పురుషులు, నలుగురు మహిళలు, 11 సెల్ ఫోన్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు, రూ. 69,200 నగదును సీజ్ చేశారు. అనంతరం ఎస్‌బీ సీఐ శ్రీహరి టాస్క్‌ఫోర్స్ సిబ్బంది వీరిని తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించగా, సీఐ వీరేంద్ర ఆదేశాల మేరకు ఎస్‌ఐ ప్రతాప్ కేసు నమోదు చేశారు. రేకుల షెడ్డులో ఓ మహిళ ఈ పేకాట నిర్వహిస్తున్నట్లు ఎస్‌బీ వారికి వచ్చిన సమాచారం మేరకు ఈ దాడి జరిగినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా తాడేపల్లి పట్టణ పరిధిలో ఉండవల్లి – తాడేపల్లి రోడ్డులో భారీగా శిబిరం ఏర్పాటు చేసి మరీ పేకాట నిర్వహిస్తున్నా.. పోలీసులు పట్టీపట్టనట్లు ఉంటున్నారని స్థానికులు తెలిపారు. వారికి పోలీసుల అండదండలు ఉండబట్టే పట్టించుకోవడం లేదని చర్చించుకుంటున్నారు.


