అఖిలభారత వడ్డెర సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు
జోగి రమేష్ అరెస్ట్ అక్రమం
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): మాజీ మంత్రి జోగి రమేష్‌ను నకిలీ మద్యం కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారని అఖిల భారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు మహేష్ ధ్వజమెత్తారు. బీసీల ఎదుగుదలను చంద్రబాబు ఓర్చుకోలేరని విమర్శించారు. గుంటూరు నగరంలోని నల్లచెరువులో ఉన్న సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నకిలీ మద్యం కేసులో అసలు నిందితులైన వారి నుంచి ఉద్దేశ్యపూర్వకంగా మాజీ మంత్రి జోగి రమేష్ పేరును చెప్పించి, అరెస్ట్ చేయటం కేవలం కూటమి ప్రభుత్వ కుట్రేనన్నారు. దీనిపై బీసీ సంఘాలు, పెద్దలు పెద్ద ఎత్తున ఉద్యమించటంతో పాటు, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. తిరుమల ఏడుకొండల స్వామి, సింహాచలం అప్పన స్వామి, కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి దర్శించుకునేందుకు వెళ్లిన భక్తులు చనిపోయిన పాపం కూటమి ప్రభుత్వానికి తగులుతుందన్నారు. జోగి రమేష్ అరెస్ట్‌ను వడ్డెర సంక్షేమ సంఘం పూర్తిగా ఖండిస్తుందని స్పష్టం చేశారు.
పార్టీల సహకారంతో పారదర్శకమైన ఓటరు లిస్టు
గుంటూరు వెస్ట్: రాజకీయ పార్టీల సహకారంతోనే పారదర్శకమైన ఓటర్ లిస్టు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాలతో కలిసి వివిధ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రతిపాదనపై అభ్యంతరాలను రాజకీయ పార్టీల వెంటనే సంబంధిత ఈఆర్వోలకు లిఖిత పూర్వకంగా అందించాలన్నారు. వీటిని క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి, పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ తుది ప్రతిపాదనలను సిద్ధం చేసి ఆమోదం కోసం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి పంపిస్తారన్నారు. నియోజకవర్గాల వారీగా ఈఆర్వోలు 1200 ఓటర్లు కంటే అధికంగా ఉన్న పోలింగ్ కేంద్రాలను రేషనలైజేషన్ చేసి ఏర్పాటు చేసిన అదనపు పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ప్రాంతాల మార్పులు, కేంద్రాల పేర్లు సవరణల ప్రతిపాదనలను సమావేశంలో వివరించారు. వీటిపై రాజకీయ పార్టీల ప్రతినిధులు పలు సూచనలు తెలిపారు. సమావేశంలో గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, డీఆర్వో షేక్ ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ గంగరాజు, విపత్తుల నిర్వహణ శాఖ జిల్లా ప్రాజెక్టు మేనేజరు లక్ష్మీకుమారి, నగరపాలక సంస్థ అదనపు కమిషనరు చల్లా ఓటులేసు, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ మల్లేశ్వరి, ఏఈఆర్‌వోలు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
అఖిలభారత వడ్డెర సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు


