కౌలు రైతులు కుదేలు
సాయంపై నోరుమెదపని ప్రభుత్వం
మోంథా తుఫాన్‌కు పూర్తిగా నాశనమైన పత్తి, మిరప పంటలు
రూ.లక్షలు ఖర్చు చేసి సాగు చేసిన కౌలు రైతులు
సాగుకు ముందే భూ యజమానికి కౌలు డబ్బు చెల్లింపు
పూర్తిగా పంట కుళ్లిపోవడంతో తిరిగి పెట్టుబడి పెట్టాల్సిన దుస్థితి
ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం
భూ యజమానుల ఖాతాలో జమ
కౌలు కార్డులు మంజూరు కాక తీవ్రంగా నష్టపోతున్న కౌలుదారులు
సాగుదారులను గుర్తించి రాయితీలు ఇవ్వాలంటున్న నాయకులు
సాక్షి, నరసరావుపేట: ఒంట్లో సత్తువు, వ్యవసాయంపై మక్కువ ఉండి సాగు చేయడానికి సొంత భూమిలేని ఎందరో కౌలు రైతులను వరుణుడు నిండా ముంచేశాడు. బతుకుదెరువు కోసం పొలాలు కౌలు తీసుకొని రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు రాత్రి రాత్రికి తుఫాన్ ధాటికి దెబ్బతిన్నాయి. చేసిన శ్రమ, పెట్టిన పెట్టుబడి మొత్తం కృష్ణార్పణమైంది. తిరిగి మళ్లీ సాగు చేయాలంటే మరోసారి అప్పు తేవాల్సిన దుస్థితి. ప్రభుత్వం ఇప్పటి వరకు తుఫాన్‌తో నష్టపోయిన రైతులను ఏవిధంగా ఆదుకుంటుందో చెప్పలేదు. ఇచ్చినా ఆ సాయం రైతుకు వెళుతుంది, మరి మా పరిస్థితి ఏంటని కౌలురైతులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కౌలు రైతుల కష్టాన్ని అర్థం చేసుకొని నష్టపోకుండా చూడాలని కోరుతున్నారు.
పల్నాడు జిల్లాలో వరద వల్ల నష్టపోయిన మొత్తం రైతులు 29,677 మంది ఉండగా, అందులో కౌలు రైతులు సుమారు 13,584 మంది ఉంటారని అధికారుల అంచనా. అయితే వీరిని ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో తెలపడం లేదు. సాగుచేసే వారినే రైతులుగా గుర్తించి నష్టపరిహారం అందించాలని కౌలు రైతుల సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అక్టోబర్‌లో ఇస్తామన్న అన్నదాత సుఖీభవ ఇప్పటికీ వేయలేదని, దాన్ని సాగులో ఉన్న కౌలు రైతులకు ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు జిల్లాలో సుమారు 1.5 లక్షల మంది కౌలు రైతులు ఉండగా కనీసం 30 వేల మందికి కూడా కౌలురైతు కార్డులు అందజేయకపోవడం అన్యాయమంటున్నారు.
కౌలు సాగు చేసేవారిలో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలే ఎక్కువ. జిల్లాలో భారీ వర్షాల పడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. సుమారు 61,368 ఎకరాల్లో సాగు చేసిన 29,677 మంది రైతులకు చెందిన పంటలు వరదనీటిలో కుళ్లిపోవడం, కొట్టుకుపోవడం జరిగింది. సుమారు రూ.200 కోట్ల వరకు నష్టపోయారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టపోయిన రైతులకు ఏవిధమైన సాయం అందిస్తోంది ప్రకటించలేదు. అఽధికారులు నష్ట వివరాలు నమోదు చేస్తున్నారు. ఇందులో 33 శాతం కన్నా ఎక్కువ పంట నష్టపోతేనే రైతుకు నష్టపరిహారం వస్తుందనే మెలిక పెట్టి, చాలా మందిని అనర్హులుగా ప్రకటించే కుట్ర చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.


