భక్తిశ్రద్ధలతో కార్తిక పూజలు
నరసరావుపేట రూరల్: కార్తిక సోమవారం జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు తరలివచ్చి దీపాలు వెలగించి పూజలు నిర్వహించారు. కార్తిక దీపాల వెలుగుల్లో ఆలయాలు కళకళలాడాయి. కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి దేవస్థానంలో సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర కార్తిక మాసం రెండో సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున 4గంటలకు స్వామి వారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులను దర్శనానికి అనుమతించారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో కార్తిక దీపాలు వెలిగించి పూజలు జరిపారు. మెట్ల పూజ చేసుకుంటూ సోఫాన మార్గం ద్వారా కొండ మీదకు చేరుకుని మొక్కలు తీర్చుకున్నారు. అభిషేక మండపంలో నిర్వహించిన అభిషేకాల్లో భక్తులు పాల్గొన్నారు. నరసరావుపేట నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా భక్తులను కొండ మీదకు చేరుకున్నారు. ద్విచక్రవాహనాలు, కార్లు, ట్రాక్టర్ల ద్వారా భక్తులు కొండమీదకు రావడంతో పార్కింగ్ ప్రాంతం వాహనాలతో నిండిపోయింది. ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు ఏర్పాట్లు పర్యవేక్షించారు. నరసరావుపేట రూరల్ ఎస్‌ఐ కిషోర్ ఆధ్వర్యంలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు.
అమరావతిలో...
అమరావతి: అమరావతిలో వేం చేసియున్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామిని భక్తులు కార్తిక సోమవారం వేకువజాము నుంచే భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులు పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలోని ఉసిరిక చెట్టు వద్ద కార్తిక దీపాలు వెలిగించి కార్తిక దామోదరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తిక సోమవారం పర్వదినం కావటంతో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అమరేశ్వరున్ని దర్శించుకున్నారు. ఆలయంలో ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అమరేశ్వరునికి అభిషేకాలు, బాలచాముండేశ్వరి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయ ఈఓ రేఖ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
ప్రత్యేక అలంకరణలో త్రికోటేశ్వరుడు
భక్తిశ్రద్ధలతో కార్తిక పూజలు
భక్తిశ్రద్ధలతో కార్తిక పూజలు


