అర్జీల పరిష్కారంపై దృష్టి
నగరంపాలెం: పొలానికి సంబంధించి తప్పుడు పత్రాలు చూపించి రూ.80 లక్షల వరకు కాజేశారని ఓ వృద్ధుడు, వ్యాపారంలో సోదరుడు మోసగించాడని మరోకరు, వేర్వేరు ఫిర్యాదులతో బాధితులు సోమవారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్‌ఎస్)లో ఫిర్యాదు చేశారు. దీపావళి పండుగ, వర్షాలు కారణంగా మూడు సార్లు పీజీఆర్‌ఎస్ తాత్కలికంగా వాయిదా పడడంతో ఫిర్యాదుదారులు అధికంగా వచ్చారు. ఎన్నడూ లేని విధంగా అర్జీలకు సంబంధించి డీపీఓ ప్రధాన ద్వారం వద్ద నంబర్ల కాగితాల స్లిప్‌లు వేసి లోనికి అనుమతించడంతో క్యూ పెరిగింది. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కూడా బాధితులు వరుసలో నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. బాధితుల నుంచి అర్జీలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ స్వీకరించారు. ఫిర్యాదిదారులకు సంబధించి సమస్యలపై సంబంధిత పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడారు. బాధితులకు నిర్ణీత వేళల్లో చట్ట పరంగా పరిష్కారం చూపాలని స్పష్టంచేశారు. అర్జీలు పునరావృతం కానీవ్వద్దని సూచించారు. జిల్లా ఏఎస్పీ జీవీ రమణమూర్తి (పరిపాలన), డీఎస్పీలు శ్రీనివాసరెడ్డి (మహిళా పీఎస్), బీవీ మధుసూదనరావు (సీసీఎస్), బెల్లం శ్రీనివాసరావు (ట్రాఫిక్)లు అర్జీలు స్వీకరించారు.
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్


