
హత్య కేసులో నిందితుడి అరెస్ట్
తెనాలి రూరల్: తెనాలిలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటనలో నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో డీఎస్పీ బి.జనార్దనరావు కేసు వివరాలను వెల్లడించారు. ఆయన చెప్పిన వివరాల మేరకు... బాపట్ల జిల్లా అమృతలూరు మండలం కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన జూటూరి తిరుపతిరావు(60) ఈ నెల 14న పట్టణంలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. తిరుపతిరావు గ్రామంలోని రామాలయం పాలకవర్గంలో కీలకంగా ఉన్నాడు. ఆలయ చెరువుల వేలం పాటల నిర్వహణ బాధ్యత చూసేవాడు. 15 రోజుల క్రితం జ్వరం రావడంతో తిరుపతిరావు తన భార్యతో కలసి తెనాలిలో నివాసం ఉంటున్న కుమార్తె గండికోట దుర్గ ఇంటికి వచ్చాడు. ఈ నెల 14న టిఫిన్ కోసం బైక్‌పై ఇంటి నుంచి బయటకు వచ్చాడు. సమీపంలో టిఫిన్ సెంటర్ వద్ద బైక్‌పై కూర్చున్నాడు. అదే సమయంలో కోరుతాడిపర్రు గ్రామానికి చెందిన గండికోట వెంకటసుబ్బారావు వచ్చి కొబ్బరి బొండాల కత్తితో విచక్షణరహితంగా దాడి చేసి పారిపోయాడు. తిరుపతిరావుతో నిందితుడికి కొంతకాలంగా విభేదాలున్నాయి. నిందితుడి వ్యక్తిగత విషయాలలోనూ తిరుపతిరావు జోక్యం చేసుకున్న కారణంగా కక్ష పెంచుకొని ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆలయ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించడం, గతంలో తన తండ్రి మృతికి కూడా తిరుపతిరావు కారణమయ్యాడని భావించి రెక్కీ నిర్వహించి మరీ హత్యకు పాల్పడ్డాడు. నిందితుడిపై పట్టణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గతంలో మూడు కేసులు, అమృతలూరు పోలీస్‌స్టేషన్‌లో రెండు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. తిరుపతిరావు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కంచర్లపాలెం రోడ్డులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ ఎస్. సాంబశివరావు, త్రీ టౌన్ ఎస్‌ఐ కరిముల్లా, రూరల్ ఎస్‌ఐ కె. ఆనంద్, సిబ్బంది ఉన్నారు.
ఆధిపత్య పోరు, పాత కక్షలే కారణమని డీఎస్పీ వెల్లడి