
గూగుల్ డేటా సెంటర్‌తో ఒరిగేదేం లేదు
నరసరావుపేట ఈస్ట్: విశాఖలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వలన రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం శూన్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ట్రంప్ టారిఫ్ ఉగ్రవాదం, అమెరికా ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. సదస్సులో శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాల వల్ల భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీనిపై ప్రధాని మోదీ చీకటి ఒప్పందాలకు తెరతీస్తున్నారని పేర్కొన్నారు. మోడీ వ్యవహార శైలితో దేశంలో ఆయిల్ సంక్షోభం తలెత్తటంతోపాటు దేశ సార్వభౌమత్వమే ప్రమాదంలో పడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఐటీ హీరోని నేనే అని ప్రగల్భాలు పలికే సీఎం చంద్రబాబు అమెరికాలో మన విద్యార్థులు పడుతున్న బాధల పట్ల కనీస సానుభూతి ప్రకటించటం లేదని అన్నారు. విదేశీ కంపెనీ గూగుల్‌కు రూ.22 వేల కోట్లు రాయితీ ఇస్తున్నారని, దీనివల్ల రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. గూగుల్ మన వద్ద రాయితీ తీసుకొని ప్రపంచమంతా వ్యాపారం చేసుకుంటూ లాభ పడుతుందన్నారు. గూగుల్ డేటా సెంటర్‌లో రెండు లేదా మూడు వందల మందికి మించి ఉద్యోగాలు రావన్నారు. గూగుల్‌కు ఇచ్చే రాయితీలతో రాష్ట్రంలో ఎన్నో మెడికల్ కళాశాలలను నిర్మించవచ్చన్నారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో చేసిన పర్యటనలకు దాదాపు రూ.1500 కోట్లు ఖర్చు చేశారని, కానీ రాష్ట్రానికి ఒక్క పైసా ప్రయోజనం లేదన్నారు. ప్రధాని మోదీ పర్యటనలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను విస్మరించటం దారుణమని పేర్కొన్నారు. ప్రధాని మోడీ పర్యటన ఆసాంతం పొగడ్తలకే సరిపోయిందన్నారు. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేశారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు