
పెదకూరపాడు వద్ద రైలు ప్రమాదం
ప్రయాణికులను కాపాడిన సిబ్బంది 108 వాహనంలో క్షతగాత్రుల తరలింపు మాక్ డ్రిల్‌లో భాగంగా నిర్వహణ పర్యవేక్షించిన డీఆర్‌ఎం, ఇతర అధికారులు
పెదకూరపాడు:పెదకూరపాడు రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. బోగీలు దెబ్బతిన్నాయి. బోగీల్లో ఇర్కుపోయిన ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, సివిల్ డిఫెన్స్, అగ్నిమాపక సిబ్బంది వారిని కాపాడే చర్యలు చేపట్టారు. అత్యాధునిక పరికరాలతో బోగీలను కట్ చేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. గాయపడిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. ఇదంతా నిజమే అనుకుంటే పొరపాటు పడినట్లే..మాక్ డ్రిల్‌లో భాగంగా గురువారం నిర్వహించారు. రైలు ప్రమాదాల సమయంలో ప్రయాణికులను సురక్షితంగా కాపాడి, ప్రాణ నష్టాన్ని నివారించే విషయంపై గుంటూరు రైల్వే డివిజన్‌లోని ఎన్డీఆర్‌ఎఫ్, సివిల్ డిఫెన్స్, రైల్వే బ్రేక్ డౌన్, స్టేట్ గవర్నమెంట్, ఫైర్, స్టేట్ గవర్నమెంట్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆధ్వర్యంలో గురువారం పెదకూరపాడు రైల్వేస్టేషన్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. గుంటూరు డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్, సీనియర్ డివిజన్ సేఫ్టీ అధికారి విజయకీర్తి, మెకానికల్ చీఫ్ ఇంజినీర్ రవికిరణ్, ఫైర్ సేఫ్టీ అధికారి శ్రీనివాసరావు, సీనియర్ డివిజన్ సిగ్నెల్ టెలికమ్యూనికేషన్ ఇంజినీర్ రత్నాకర్, సేఫ్టీ చీఫ్ అధికారి కిషోర్, సీఆర్‌ఎస్‌ఈ కమల్‌కాంత్ పర్యవేక్షించారు. మాక్ డ్రిల్‌లో భాగంగా రెండు రైల్వే కోచ్‌లు పట్టాలు తప్పి ప్రమాదానికి గురికాగా అందులోని ప్రయాణికులు రక్తపు గాయాల మధ్య ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం ఉండేలా నెలకొల్పారు. సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. బోగీలలో ఇరుక్కుపోయిన ప్రయాణికులను సురక్షితంగా రక్షించేందు కు అత్యాధునిక టూల్స్ ఉపయోగించారు. బోగీల కిటికీలు, రూఫ్‌లు కట్ చేసి ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తాత్కాలికంగా ఏర్పాటుచేసిన టెంట్లలో వైద్యులు ప్రథమ చికిత్స చేసి 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
సిబ్బందిని సంసిద్ధం చేసే నిరంతర చర్య
డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో ఏ సమయంలో అయినా సిబ్బందిని సంసిద్ధత చేసే నిరంతర చర్య మాక్ డ్రిల్ అన్నారు. మాక్ డ్రిల్ ద్వారా రియల్ టైమ్‌లో సిబ్బంది పనితీరు ప్రతిబింబిస్తుందని తెలిపారు. ప్రాణ నష్టం నివారించే లక్ష్యంగా ఇటువంటి మాక్ డ్రిల్స్ ఉపయోగపడుతాయన్నారు. సిబ్బంది సమన్వయాన్ని మెరుగుపరుస్తుదన్నారు.
–డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్

పెదకూరపాడు వద్ద రైలు ప్రమాదం

పెదకూరపాడు వద్ద రైలు ప్రమాదం