
ఆరున స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానం
రాష్ట్ర స్థాయిలో అవార్డుకు ఎంపికై న దళిత బహుజన రిసోర్స్ సెంటర్ జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు, సంస్థలకు అవార్డులు వెల్లడించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా
నరసరావుపేట: రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అందించనున్న స్వచ్ఛ ఆంధ్ర అవార్డులను ఈనెల 6న ప్రదానం చేయనున్నామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుల పేరుతో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛతా అవార్డులను ప్రకటిస్తోందని, అదే బాటలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డులు ప్రదానం చేయడం ద్వారా దేశంలోనే మొదటి స్వచ్ఛతా అవార్డులను అందిస్తున్న రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ అవతరించిందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్వచ్ఛతా ఎన్జీఓగా దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఎంపికైనట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో 16 విభాగాల్లో 51 మంది వ్యక్తులు, సంస్థలు అవార్డులు దక్కించుకున్నాయన్నారు. అక్టోబరు 6న జిల్లా ఇన్‌చార్జి మంత్రి చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేస్తామన్నారు. స్వచ్ఛ నగర, మండలాలు, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు, పాఠశాలలు, ఆసుపత్రులు, కార్యాలయాలు, రైతు బజార్లు, బస్‌స్టేషన్లు, పరిశ్రమలు మొదలైన వివిధ విభాగాలలో అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందని వివరించారు. మూడు దశల్లో స్వచ్ఛ ఆంధ్ర–2025 రేటింగ్, ర్యాంకింగ్ జరిగిందని తెలిపారు. రాష్ట్ర, జిల్లాస్థాయి అవార్డు గ్రహీతల పూర్తి వివరాలను ఎస్‌ఎఎస్‌ఎ (సాసా) పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని చెప్పారు. ఈ విజయాలు స్వర్ణ ఆంధ్ర –స్వచ్ఛ ఆంధ్ర ఉద్యమాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే స్ఫూర్తినిస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు.
మూడో దశలో 25 గ్రామాల్లో రీసర్వే
నరసరావుపేట: జిల్లాలో శుక్రవారం నుంచి మూడో దశ రీ సర్వే ప్రారంభం అవుతుందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 150 గ్రామాలలో రీసర్వే పూర్తి చేశామని, ప్రస్తుతం మరో 41 గ్రామాలలో జరుగుతుందని అన్నారు. మూడో దశలో 25 గ్రామాలలో రీసర్వే చేయబోతున్నామని తెలిపారు. రైతులందరూ రీసర్వేకి సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది మీ భూమి సర్వే ఎప్పుడు చేస్తారో ముందుగా నోటీసు ద్వారా తెలియజేస్తారని, ఆ సమయంలో రైతులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. రీసర్వేలో రైతుల నుంచి అందిన అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పరిశ్రమల అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేయండి
నరసరావుపేట: జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో పరిశ్రమల శాఖ, నైపుణ్యాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. రెండు శాఖల సిబ్బంది, కార్యక్రమాల గురించి వివరాలు అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అందించిన భూముల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నష్టాల్లో నడుస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి సాయం అందించగలిగే అవకాశాలను అన్వేషించాలన్నారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో శిక్షణ ఇవ్వడంపై నైపుణ్యాభివృద్ధి శాఖ దృష్టి సారించాలన్నారు. శిక్షణ పొందిన అభ్యర్థులందరికీ 100శాతం ప్లేస్‌మెంట్ దక్కేలా చూడాలన్నారు. జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ గనోరే, ఎల్‌డీఎం రాంప్రసాద్, డీఆర్‌డీఎ అసిస్టెంట్ పీడీ ఆర్.ప్రతాప్, జిల్లా పరిశ్రమల అధికారి నవీన్, ఏపీఐఐసీ జెడ్‌ఎం డాక్టర్ ఎల్‌ఎం నరసింహారావు, జిల్లా అదనపు నైపుణ్య అభివృద్ధి అధికారి రామాంజనేయులు పాల్గొన్నారు.