
పింఛన్ నగదు మాయం
పింఛన్ నగదు సొంతానికి వాడుకున్న వీఏవో పంచాయతీ కార్యాలయంలో నిర్బధించిన పింఛన్‌దారులు యూరియా ఇప్పిస్తానంటూ కూడా నగదు వసూలు చేశాడంటూ ఆరోపణలు. ఎంపీడీవో ఆధ్వర్యంలో విచారణ తిరిగి చెల్లించే విధంగా లిఖిత పూర్వక అంగీకార పత్రం
దొడ్లేరు(క్రోసూరు): మండలంలోని దొడ్లేరు గ్రామ వీఏవో మనోజ్‌కుమార్ సామాజిక పింఛన్ల నగదు లబ్ధిదారులకు ఇవ్వకుండా సొంతానికి వినియోగించుకున్నాడు. శుక్రవారం గ్రామానికి చెందిన కొందరు పింఛన్‌దారులు పంచాయతీ కార్యాలయంలో అతనిని నిర్బంధించారు. వివరాల్లోకి వెళితే... ఈనెల 1వ తేదీన గ్రామంలోని ఒకటో వార్డులో 58 మంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసేందుకు గ్రామ రైతుభరోసా కేంద్రం వీఏవో మనోజ్‌కుమార్‌కు బాధ్యతలు అప్పగించారు. వాటిలో సుమారు 20 మంది లబ్ధిదారుల వద్ద వేలిముద్రలు తీసుకున్నాడు. వేలిముద్రలు సరిగా పడలేదు, డబ్బులు గురువారం వచ్చి ఇస్తానంటూ నమ్మించి వెళ్లిపోయాడు. డబ్బులు ఇస్తాడని ఎదురు చూసిన బాధితులు ఎంతకూ రాకపోవటంతో ఫోన్లు చేసి పిలిపించారు. బ్యాంకుకు వెళ్లి వస్తానని తాత్సారం చేసి పంచాయతీ కార్యాలయానికి చేరుకోవటంతో అక్కడ లబ్ధిదారులు పింఛన్ నగదు కోసం నిలదీశారు. పింఛన్ నగదు లేవు రెండు రోజుల్లో సర్దుతానంటూ చెబుతుండటంతో అక్కడే నిర్బంధించారు. టీడీపీ నాయకులు, గ్రామపెద్దలు పంచాయతీ కార్యాలయానికి చేరుకుని పోలీసులను తెలియచేశారు. పోలీసులు తీసుకొచ్చి ఎంపీడీవోకు అప్పగించారు. దీనిపై ఎంపీడీవో జి.శ్రీనివాస్ తెలుపుతూ 20 మందికి పింఛన్ డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవమే, ఎంత మేర ఇవ్వాలన్నది లాగిన్‌లో శుక్రవారం తెలుస్తుందన్నారు. వీఏవో వాడుకున్న నగదు శునివారం తీసుకొచ్చి అప్పగించే విధంగా లిఖితపూర్వకంగా రాయించుకున్నట్లు తెలిపారు. నగదు అప్పగించని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో తెలిపారు.
యూరియా ఇప్పిస్తానని
నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం యూరియా డిమాండ్‌ను అసరాగా తీసుకుని యూరియా తెప్పించి ఇస్తానని కొంత మంది రైతుల దగ్గర నగదు వసూలు చేసినట్లు తెలిసింది. డబ్బులిచ్చిన రైతులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఎంత మేర వసూలు చేశారన్నది స్పష్టంగా తెలియరాలేదు.